పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం
మహారాష్ట్ర సిఎం థాకరే పిలుపు
ముంబయి: తెలంగాణలో కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలో జన సమూహాలను నివారించడానికి ఆందోళనలు, సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. పండుగలు, ఉత్సవాలను మనం తర్వాత జరుపుకోవచ్చని, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమే మనకు ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. కరోనా కేసుల రోజువారీ పెరుగుదల దృష్టా పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఎవరు మాత్రం కోరుకుంటారని, అయితే ఇప్పుడు ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏమీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. రానున్న పండుగ రోజులు అత్యంత సంక్లిష్టమైనవి, సవాళ్లతో కూడకున్నదని ఆయన చెప్పారు. పరిస్థితి అదుపుదాటకూడదన్నదే అన్ని రాజకీయ పార్టీల లక్షం కావాలని ఆయన అన్నారు. కొవిడ్ మూడవ వేవ్ ఇప్పుడు మన గడప ముందు ఉందని, కేరళలో రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని, ఇది ప్రమాద సూచికని ఆయన అన్నారు. దీన్ని మనం సీరియస్‌గా తీసుకోకపోతే మహారాష్ట్ర కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.