పోటీగా కొత్త విద్యార్థి విభాగం ఏర్పాటు
పాట్నా: తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి)లో అనామకుడిగా మిగిలిన ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి విభాగానికి పోటీగా మరో నూతన విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం ఛత్ర జనశక్తి పరిషద్ పేరిట కొత్త విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసిన తేజ్ ప్రతాప్ ఆర్‌జెడికి చెందిన అధికారిక విద్యార్థి విభాగానికి ఇది పోటీ కాదని, గ్రామస్థాయిలో ఆర్‌జెడికి అనుకూలంగా యువజనులను సమీకరించడానికి ఇది కృషి చేస్తుందని ప్రకటించారు. తనకు లాలూ ప్రసాద్ ఆశీస్సులు ఉన్నాయంటూ శాసనసభ్యుడు కూడా అయిన తేజ్ ప్రతాప్ వెల్లడించారు. కాగా&ఆర్‌జెడి రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్‌తో తీవ్ర విభేదాల కారణంగా పార్టీకి దూరమైన తేజ్ ప్రతాప్ తన సోదరుడు, పార్టీలో కీలక నాయకుడైన తేజస్వి యాదవ్‌పై ఆగ్రహంతోనే విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవలే తనకు అత్యంత సన్నిహితుడైన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆకాశ్ యాదవ్‌ను జగదానంద్ పదవి నుంచి తప్పించడంపై కూడా తేజ్ ప్రతాప్ మండిపడుతున్నారు.