Tuesday, November 26, 2024

17న ఆదిలాబాద్‌కు అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit shah's telangana tour is confirmed

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 17న విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభకు రాష్ట్ర బిజెపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ వెయ్యి ఊడలమర్రి వద్ద బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొననున్నారు. అమిత్‌షా పర్యటన రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. నాటి సర్దార్ పటేల్‌ను గుర్తు చేసుకుంటూ తెలంగాణ విమోచన కోసం జరిగిన ఉద్యమం, బలిదానాలు, ప్రాణత్యాగాలను తెలంగాణ ప్రజలకు గుర్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి ఈ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

బిజెపి రాష్ట్ర పార్టీ మొత్తం ఈ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎంపి సోయం బాపూరావు ఆహ్వానించారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు కోసం నేడు నిర్మల్‌లో బిజెపి జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ నెల 9న సభ విజయవంతం చేయడానికి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించి, కార్యాచరణను ప్రకటిస్తుంది. భారతదేశం ఆగస్టు, 1947లో బ్రిటీష్ నుండి స్వాతంత్య్రం పొందితే, తెలంగాణ మాత్రం సెప్టెంబర్ 17, 1948న నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన విషయం నేటి తరం ప్రజలకు తెలియదు. ఈ విషయాన్ని గత రెండు దశాబ్దాలుగా ఈ తరం ప్రజలకు చెప్పడానికి బిజెపి తెలంగాణ నుండి అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే 17 సెప్టెంబర్‌ను తెలంగాణ విమోచన పొందిన రోజుగా ప్రకటించి, అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఉత్సవాలు నిర్వహించాలని గత కాంగ్రెస్, ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూనే ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News