Saturday, November 23, 2024

పర్యావరణం మీద పర్యాటక కత్తి!

- Advertisement -
- Advertisement -

Tourism effect on the Environment

 

కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్‌డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ కొవిడ్ భయంతో ఇండ్లకే పరిమితమైన వారిలో అనేకమంది కాస్త బయట గాలి పీల్చుకోవాలనీ, కొవిడ్ ఒత్తిడి నుండి కొంతైనా స్వాంతన పొందాలని ప్రయాణాలు మొదలు పెట్టారు. నగర జీవనానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా కొన్ని రోజులైనా గడపాలని మారుమూల ప్రాంతాలకు, అడవుల్లోకి, పర్వత ప్రాంతాలకి పరుగులు తీశారు. తాము వెళ్ళిన అరుదైన ప్రాంతాల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి చూసి మరింత మంది ఆ ప్రదేశాల గురించి తెలుసుకుని మరీ అక్కడికి వెళ్ళారు. మన ఆహ్లాదం కోసం, రోజువారీ జీవితం నుండి విశ్రాంతి కోసం ప్రయాణాలు చేయడం మంచిదే కానీ మనలో ఎంతమంది మనం వెళ్ళే ప్రాంతాలలోని స్థానికుల, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాల పట్ల గౌరవంతో ఉన్నారు? అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని, జీవ వైవిధ్యాన్ని డిస్టర్బ్ చేయని ప్రవర్తన పట్ల అవగాహన కలిగి ఉన్నారు? ఎంతమంది అటువంటి ప్రవర్తనని ఆచరిస్తున్నారు?

ప్రయాణాల పట్ల, పర్యాటకం పట్ల మన ఉత్సాహం కొత్తదేమీ కాదు. మన దేశంలో పర్యాటక పరిశ్రమ వార్షిక విలువ అక్షరాలా 17 లక్షల కోట్ల రూపాయలు. 2019 నాటి ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివెనెస్ (పోటీపడే సామర్థం) నివేదిక ప్రకా రం ప్రపంచంలోని మొత్తం 140 పర్యాటక దేశాలలో మన దేశం 34వ స్థానంలో ఉంది. దేశంలో దాదాపు నాలుగున్నర కోట్ల మందికి పర్యాటక రంగం ఉపాధి కల్పిస్తుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరొకవైపు చూస్తే మన మితిమీరిన పర్యాటకం వలన జరుగుతున్న సామాజిక, పర్యావరణ అనర్ధాల పట్ల మనకు అవగాహనా లేదు, సరైన అంచనాలు, గణాంకాలు లేవు. దీనిని మరింత సమగ్రంగా అర్ధం చేసుకునేందుకు దేశంలోని కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాల ప్రస్తుత పరిస్థితి ఏమిటో చూద్దాం. ఉత్తరభారత దేశంలో కాస్త ఎండలు ముదరగానే అందరూ పరిగెత్తేది హిల్ స్టేషన్స్‌కు. అక్కడి చల్లని వాతావరణం, ప్రకృతి అందాల మధ్య సేద తీరుతూ మండే ఎండల నుండి కొన్నాళ్ళైనా తప్పించుకోవాలని ఆరాటపడుతూ ఈ పర్వత సానువులకు పరుగులు పెట్టే పర్యాటకుల వలన మన దేశంలోని హిల్ స్టేషన్లు ఎలా మారాయో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

పర్యాటకుల పాలిట స్వర్గధామంగా పిలవబడే సిమ్లా పట్టణంలోకి ప్రతిరోజూ సరాసరి ఐదువేల పర్యాటక వాహనాలు వస్తుంటాయి. వారాంతాలలో వీటి సంఖ్య మరింత ఎక్కువ. అన్ని వాహనాలు పార్క్ చేసే సదుపాయాలు పట్టణంలో లేకపోవడంతో వాటిని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం వలన పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకే 120 మంది పోలీసులను నియమించాల్సి వచ్చిందని స్థానిక డిఎస్‌పి చెప్పారంటే ట్రాఫిక్ సమస్య ఇక్కడ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత పెద్ద సంఖ్య లో పర్యాటకులు రావడం వలన సంభవించిన అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అందమైన ఓక్, పైన్ చెట్లతో నిండి ఉండే ప్రాంతమంతా హోటల్స్, రిసార్ట్‌లతో వాటి నిండా మనుషులతో నిండిపోతుంది. ఏ కాలుష్యమూలేని అందమైన ప్రాంతంగా ఉన్న సిమ్లా ఇప్పుడు అతి ఎక్కువ కాలుష్యం ఉన్న పట్టణాలలో ఒకటి. పట్టణంలోని స్థానికులకు, పర్యాటకులకు విపరీతమైన నీటి ఎద్దడి ఉంది. నిశ్శబ్దం రాజ్యమేలిన అందమైన దారులు ఇప్పుడు పర్యాటకులు, వారి వాహనాల రణగొణ ధ్వనులతో కర్ణకఠోరంగా మారిపోయాయి.

మరొక హిల్‌స్టేషన్ ముస్సోరి గత రెండేళ్ళుగా మునుపెన్నడూ లేని నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. పది వేల మందికన్నా తక్కువ మందికి నివాస సదుపాయాలతో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన ఊటీలో ఇప్పుడు లక్షా ఇరవై ఐదువేల మంది నివాసం ఉంటున్నారు. వీరికి అదనంగా ప్రతిరోజూ వచ్చే టూరిస్ట్‌ల వలన నీటికి, భూమికి విపరీతమైన ఒత్తిడి ఉంది.ఒక పక్కన మంచు కొండలతో, మరోవైపు పచ్చని ప్రకృతితో అలరించే డార్జిలింగ్‌ను ఏటా మూడున్నర లక్షల మంది దేశీయ పర్యాటకులు సందర్శిస్తారని ఒక అంచనా. వీరి వలన జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, పెరుగుతున్న కాలుష్యం, నీటి ఎద్దడి సమస్యల పట్ల మాత్రం సరైన అంచనాలు లేవు. కానీ డార్జిలింగ్ వెళ్లదలుచుకుంటే మీరు ఉండబోయే హోటల్‌లో నీళ్లు వస్తున్నాయో లేదో చూసుకుని హోటల్ ఎంపిక చేసుకోండి అని సలహాలు ఇస్తారు అంటే అక్కడి సమస్య తీవ్రత అర్ధమవుతుంది.

ఆ మధ్య ‘Do not come to Ladakh’ పేరుతో ఒక వీడియో చూశాను. ‘మీకు ఇక్కడి ప్రకృతి సౌందర్యం పట్ల గౌరవం లేదు. దానిని కాపాడాలనే ఆలోచన లేదు. రోజుకు 30,000 ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఒక్క లేహ్ ప్రాంతంలోనే యాత్రికులు విసిరి వేస్తున్నారు. అవి ల్యాండ్ ఫిల్‌గా మిగిలిపోవడం లేదా వాటిని తగలబెట్టడం వల్ల స్థానికుల ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. దయచేసి ఇక్కడకి రాకండి. లేదా మీ ప్రవర్తనని మార్చుకోండి’ అని ఒక యువ జంట ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటి యువతలో చాలామందికి లడఖ్‌కు, ఇతర పర్వత, అటవీ ప్రాంతాలకు మోటార్ సైకిల్ రైడ్లు చేయడం అంటే ఎంతో క్రేజ్. తమ క్రేజ్ కోసం ఆ ప్రాంతాలను కలుషితం చేయడంతో పాటు అక్కడి స్థానికులను అనాగరికులుగా చూసే పర్యాటకులకు కొదవేమీ లేదు. ఇటీవల కొందరు మిత్రులు తెలంగాణలో అరుదైన కృష్ణజింకలు సంచరించే ప్రదేశానికి వెళ్లి అందమైన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో అద్భుతమైన ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసిన వారెవరికైనా అక్కడికి స్వయంగా వెళ్ళి ఆ అందాలను తమ కళ్ళతో తనివి తీరా చూడాలని, అందమైన అనుభూతులను మనసులో నింపుకోవాలని అనిపించడం సహజం. అలాగే ఎంతో మంది ఆ ప్రాంతానికి పరుగులు పెట్టారు కూడా.

అయితే వేరెక్కడా అంత పెద్ద సంఖ్యలో సంచరించని కృష్ణజింకలు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నాయి అంటే వాటి జీవనానికి అనుకూలమైన సహజ వాతావరణం అక్కడ ఉండి ఉంటుంది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లడం వలన అక్కడి జీవ వైవిధ్యానికి మనం భంగం కలిగించే అవకాశం ఉంది కదా. ఇటువంటి అరుదైన ప్రదేశాలలో పర్యాటకులుగా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశం పట్ల అవగాహన లేకుండా, అక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం నుండి ఏ ప్రయత్నాలు మొదలవకుండా మనం పర్యటనలు మొదలు పెట్టడం వలన అక్కడి ప్రకృతికి మనం చేసే హాని అంచనా వేయగలమా?

ఇక అడవుల పట్ల, ఆదివాసీల పట్ల మనకున్న ప్రేమ తక్కువేమీ కాదు. ప్రకృతి సహజమైన అందాలు, కల్మషం లేని మనుషులను కలవాలని అడవులలోకి ప్రయాణాలు చేసే వారిలో ఎంతమంది ఆ అటవీ పర్యావరణ, జీవ వైవిధ్యం పట్ల, అక్కడి స్థానికుల సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహనతో వెళ్తున్నారు? ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లే అనేక మంది అక్కడి ఆహారం, నీరు తమకి సరిపడతాయో లేదో అని బయట నుండి ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్ళు తీసుకెళ్ళడం నేను చూశాను. తాము వెళ్ళే చోట ఉంటున్న స్థానికులు తినే ఆహారం తిని, వారు తాగే నీరు తాగడానికి ఇబ్బంది పడే మనకు వారి పట్ల ఏమి గౌరవం ఉన్నట్లు? మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేస్తున్నామని సరిపెట్టుకున్నా ఆ తీసుకువెళ్లిన పదార్ధాల తాలూకు వ్యర్ధాలను, ఖాళీ అయిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను తిరిగి తీసుకు వస్తామా అంటే చాలా వరకూ లేదనే చెప్పాలి. ఒకరి ప్రాంతానికి వెళ్లి కొద్ది గంటలో, రోజులో గడిపి వచ్చే మనకు ఆయా ప్రాంతాల పర్యావరణాన్ని శాశ్వతంగా దెబ్బతీసే హక్కు ఎక్కడిది?

ఇక పురాతన దేవాలయాలు, చారిత్రక భవనాల పట్ల మనకు ఉన్న గౌరవం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్ని మారుమూల పురాతన గుడులలో ప్రేమికులు, స్నేహితులు చెక్కుకున్న పేర్లను చూడలేదు మనం? కాలుష్యం, పర్యావరణ, సాంస్కృతిక విధ్వంసం, చైల్డ్ ట్రాఫికింగ్, వ్యభిచారం, స్థానిక వనరులపై ఒత్తిడి ఇలా చెప్పుకుంటూ పోతే మితిమీరిన పర్యాటకం సృష్టించే సమస్యలు ఎన్నో. అయితే ఏమిటి మనం పర్యటనలు మానేయాలా? రోజువారీ జీవితం నుండి బయటపడే వెసులుబాటే లేదా? అనుకోవడానికి లేదు. బాధ్యతాయుతమైన పర్యాటకం పట్ల అందరం అవగాహన పెంచుకుంటే మన అందమైన పర్యాటక ప్రదేశాలను నరక కూపాలుగా మార్చే పాపం మూటకట్టుకోకుండా ఆనందంగా ప్రయాణాలు చేయగలం.

అసలు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోవడానికి కారణం మనల్ని ఒక చోట నిలవనివ్వని భ్రమణ కాంక్షా? లేక అందరూ కొత్త కొత్త ప్రదేశాలు చూసి గొప్పగా ఫోటోలు ప్రదర్శించుకోవడం చూసి మనమేదో వెనుకబడిపోతున్నామనే దిగులా? లేక దైనందిన జీవితంతో విసుగెత్తి తలదాచుకునేందుకు, సేద తీరేందుకు కొత్త ప్రదేశాన్ని వెతుక్కునే పలాయనవాదమా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు చేయడం తమ అభిరుచిగా (passion) ఉండి కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ, అక్కడి జీవ, ప్రాకృతిక, సాంస్కృతిక వైవిధ్యాలను అర్ధం చేసుకుంటూ వెళ్ళేవారి పట్ల నాకే ఫిర్యాదులూ లేవు. కానీ దానిని ఒక ఫ్యాషన్ గానో, ట్రెండ్ గానో భావించి, బాధ్యతాయుతమైన పర్యాటకం పట్ల కనీస అవగాహన కూడా పెంచుకోకుండా ప్రయాణాలు చేయడం పట్ల నాకు తీవ్రమైన అభ్యంతరమూ, భయమూనూ!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News