వాషింగ్టన్: అఫ్ఘానిస్తాన్‌లో కొత్తగా ఏర్పడిన తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తాలిబన్లు తమ తాత్కాలిక ప్రభుత్వంపై ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే మంగళవారం బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ తాలిబన్లతో అసలు సమస్య చైనాకు ఉందని చెప్పారు. పాకిస్తాన్, రష్యా, ఇరాన్ తరహాలోనే చైనా కూడా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ఈ నాలుగు దేశాలు తాలిబన్లపై తమ వైఖరిని తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి నిర్ణయం కోసం మనం కూడా వేచి చూద్దామని ఆయన అన్నారు.
ఏం జరుగుతుందోనని తనకు కూడా ఎంతో ఆసక్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. అఫ్ఘాన్‌లో తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించకూడదని కోరుతూ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా గతంలో పనిచేసిన నిక్కీ హేలీ ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. అఫ్ఘాన్‌లో కొత్తగా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితుడైన వ్యక్తి ఎఫ్‌బిఐకి చెందిన మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉగ్రవాదిగా ఉన్నాడని, అలాంటి ప్రభుత్వాన్ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా అమెరికా గుర్తించకూడదంటూ ఆమె ట్వీట్ చేశారు.
Joe Biden comments on future Taliban Govt