నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూ వర్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
ప్రభుత్వాధికారిగా కనిపిస్తా…
ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లోకెల్లా ‘టక్ జగదీష్’ నాకు ఎంతో ప్రత్యేకం. పూర్తిగా కమర్షియల్ సినిమాలో నటించాను. ప్రభుత్వాధికారి గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్‌గా తన అధికారాన్ని చూపించే పాత్ర నాది. పాత్రలో చాలా అమాయకత్వం కూడా ఉంటుంది. మనసులో ఏముంటే అదే మాట్లాడే అమ్మాయిగా కనిపిస్తా. తాను కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే పాత్రలో నటించాను.
అందుకే ఓటీటీలో…
ఇది ఖచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో టక్ జగదీష్ సినిమా విడుదలవుతుండటంతో ఒకేసారి ఎంతో మంది చూసే అవకాశం ఉంది.
ఎంతో నేర్చుకున్నా…
నానితో ఇది రెండోసారి కలిసి నటించడం. మొదటగా అతనితో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించాను. కానీ అందులో నాది చిన్న పాత్ర. కానీ ఈసారి మాత్రం నానితో ఎక్కువ సమయం కనిపించే అవకాశం వచ్చింది. ఆయనను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను.
రియలిస్టిక్‌గా ఉంటుంది…
‘టక్ జగదీష్’ కమర్షియల్ సినిమా అయినా కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఓవర్ యాక్షన్, డ్రామా సీన్లు ఉండవు. యాక్షన్ ఉంటుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నిన్నుకోరి, మజిలి సినిమాలు చూసినప్పుడు ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నాను. నాకు డ్రామా ఎమోషనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.
భిన్న పాత్రల్లో నటించాలనుంది…
ఓ నటిగా నేను భిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటాను. అయితే నా పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉందని చూస్తాను. నా పాత్ర కథకు బలమైందిగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అన్ని రకాల పాత్రలను చేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నా.
తదుపరి చిత్రాలు…
నేను చేస్తున్న ‘వరుడు కావలెను’ అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ద్విభాష చిత్రం ‘ఒకే ఒక జీవితం’, మరో తమిళ సినిమాకు సైన్ చేశాను. ఓ వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. నాకు సినిమాలు తీయాలని ఉంది. ఓటీటీ కోసం చిన్న సినిమాలను తీయాలని అనుకుంటున్నాను. కో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను.