ఆయుష్మాన్ భారత్‌ను అమలుకు నేనే ఒప్పించా, కొవిడ్ వ్యాక్సినేషన్‌లో మనమే బెస్ట్, గవర్నర్‌గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను, ఆనందంగా ఉంది, ప్రజాసేవా స్పూర్తితోనే పనిచేస్తా, ప్రజాదర్బార్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తా: మీడియాతో ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు సత్ సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఒక గవర్నర్‌కు, సిఎంకు మధ్య ఉండాల్సిన పరస్పర సహకార ధోరణితోనే ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనపై ఎలాంటి రాజకీయ వత్తిళ్లు కూడా లేవన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణాలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు సిఎం కెసిఆర్ చాలా సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ కంటే.. ఆరోగ్య శ్రీ పథకమే మంచిదని పలుమార్లు సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారన్నారు. అందుకే, ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయడం కుదురదన్నారు. ఈ విషయంలో తాను సిఎం కెసిఆర్‌ను ఒప్పించానని(కన్విన్స్) అన్నారు. తాను చెప్పిన విషయాన్ని ఆయన ఎంతో సహృదయంతో అర్థం చేసుకుని రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తామని ఇటీవల అధికారికంగా ఒక ప్రకటన చేశారన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వన్ అమాంగ్ అండ్ అమాంగస్ట్ ది పీపుల్ అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు.
అనంతరం తమిళిసై మాట్లాడుతూ, గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఇటీవల చనిపోయిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తెలంగాణ గవర్నర్‌తో పాటు ఆరు నెలలుగా పుదుచ్చేరి లెఫ్ట్‌న్నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక గైనకాలజిస్టు డాక్టర్‌గా తల్లి, బిడ్డను గతంలో ఎలా కాపాడానో.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను కూడా అలాగే నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే లెఫ్ట్‌న్నెంట్ గవర్న్‌గా మరిన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయన్నారు. అందుకే పుదుచ్చేరికి కొంత సమయం అధికంగా ఇస్తున్నానని అన్నారు. గవర్నర్‌గా, లెఫ్టన్నెంట్ గవర్నర్‌గా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అందులో ప్రజలకు సేవ చేయాలన్న తలంపే ఉంటుందన్నారు. అందుకే పుదుచ్చేరిలో తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి పెట్రోల్‌పై 2 శాతం వ్యాట్ తగ్గించానిని తెలిపారు.
తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఇందుకు రాజ్ భవన్ సిబ్బంది సహకారం కూడా ఎంతో ఉందని తెలిపారు. రాష్ట్రపతి రామానాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ సందర్భంగా తమిళిసై కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మీడియా ఎంతగానో సహకరించిందని, అందుకే తాను ప్రజలకు మరింత చేరువ కాగలినట్లు వెల్లడించారు. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనకు మొదటి నుంచి సోదర సంబంధాలు ఉన్నాయని గవర్నర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తాను కొత్త రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన భావన ఎప్పుడు కలగలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో గవర్నర్‌గా తనవంతు సేవలను మరింతగా అందిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల్లో పనిచేయటం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండటం చాలా భిన్నమైనవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా గవర్నర్‌గా తాను చేపట్టిన కార్యక్రమాలకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
వాక్సినేషన్‌లో తెలంగాణే బెస్ట్
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరోనా మహమ్మాని పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నంత వేగంగా మరే రాష్ట్రంలో జరగడం లేదని కితాబిచ్చారు.టీకా ఉత్పత్తికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాని చెప్పారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడం కోసం తండాల్లోని గిరిజనుల మధ్య వ్యాక్సిన్ వేసుకున్నానని తెలిపారు. కరోనాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు. నిమ్స్‌తో పాటు కొన్ని ఆస్పత్రుల్లోని కోవిడ్ పేషంట్‌లను పరామర్శించానని అన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ లో ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కొంత న్యూట్రిషన్ సమస్యలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆసమస్య కొంత సమస్య తగ్గిందన్నారు. కరోనా కారణంగా ఆదివాసీ గిరిజన ప్రాంతలకు వెళ్లలేక పోయానని.. పరిస్థితిలు కొంత తగ్గు ముఖం పట్టిన తర్వాత కచ్చితంగా వెళ్తానన్నారు.
కొవిడ్ సమయంలో తమవంతుగా రోగులకు కిట్స్ అందించిన దాతలను గవర్నర్ అభినందించారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్ క్రాస్, ఇండియన్ ఆర్మీ సేవలకు ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రధానంగా గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు మూడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అలాగే రాజ్ భవన్ అన్నం, టెలీ మెడిసిన్, రాజ్ భవన్ మహిళలకు బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ సహా పలు కార్యక్రమాలు వ్యక్తిగతంగా తనకు అమితమైన సంతోషాన్ని ఇచ్చాయని వివరించారు. తెలంగాణలో ఉన్నత విద్య విలువలు పెంచేందుకు వైస్ ఛాన్స్లర్లతో తరచూ చర్చిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పేదరికంతో చాలా మందికి ఆన్లైన్ క్లాస్ లు వినడానికి ఇబ్బంది గా ఉంది అంటే ఎన్‌జివోసహకారంతో 5గురికి ల్యాప్ టాప్‌లు కూడా ఇప్పించామన్నారు. ఇవి వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఐటి సంస్థల నుంచి పాత ల్యాప్‌ట్యాప్‌లను సేకరిస్తున్నామని చెప్పారు.
అలాగే వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని కనబరుస్తోందన్నారు. ఇందులో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం నిలవడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతుండడంతో రైతున్నల భూములు పచ్చదనంగా మారుతున్నాయన్నారు. దీని కారణంగానే రాష్ట్రంలో పెద్దఎత్తున పంటల ఉత్పత్తి సాగుతోందన్నారు.
ప్రజాదర్భార్‌పై త్వరలో నిర్ణయం
గవర్నర్లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలన్నదే తన అభిమతన్నారు. ఇందుకోసం కనీసం నెలకు ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి ప్రజాదర్భార్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రం ఎప్పుడు ప్రారంభం కావాల్సి ఉండిందన్నారు. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణకు శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రజాదర్భర్ కార్యక్రమంపై మరోసారి దృష్టి సారించినట్లు ఆమె స్పష్టం చేశారు. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.రాజ్ భవన్ కాదు ఇది ప్రజా భవన్ అని అన్నారు గవర్నర్ తమిళిసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ను గవర్నర్ ఆఫీస్ గా మార్చామన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగుందన్నారు.తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు తమిళిసై సౌందరరాజన్. ఈ సందర్భంగా మాట్లాడారు.
Good Relationship with CM KCR: Guv Tamilisai