సూర్యాపేట: మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ప్రణాళికల్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 34,024 చెరువులను చేపల పెంపకానికి అనువుగా గుర్తించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పెంపకంలో బాగంగా గురువారం ఉదయం ఆరవ విడత చేపల పెంపకాన్ని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు యస్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉచిత చేపల పెంపకంతో మత్స్యకారులను ఆర్థికపరిపుష్టి చేయవచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని కెసిఆర్ గుర్తించారన్నారు. అందులో భాగంగానే ఆరవ విడత చేపల పెంపకానికి ప్రభుత్వం గుర్తించి 34,024 చెరువులలో 89 కోట్ల అంచనా వ్యయంతో 93 కోట్ల చేపల పెంపకం జరుగుతుందని ఆయన చెప్పారు.
అంతే గాకుండా 25 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్లకు పై చిలుకు రొయ్యల పెంపకం ఉంటుందన్నారు. చేపల పెంపకంతో రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకరావాలి అన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, యంపిపిపి మర్ల స్వర్లలత చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా మత్స్యశాఖాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -