మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అచ్చ తెలుగుదనానికి యాసకు సేవలు చేసి కలాన్ని అక్షర అణ్వస్త్రంగా వాడిన భాషాభిమాని కాళోజీ నారాయణరావు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కాళోజీ మానవీయ విలువలను చాటారని కొనియాడారు. మానవతే కేంద్రంగా కవిత్వాన్ని రాసి ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కాళోజీ పేరిట స్మారక పురస్కారాలు ఇస్తున్నందుకు సిఎం కెసిఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాళోజీ ఆశీస్సులతో, సిఎం కెసిఆర్ ఆలోచనలతో సాంస్కృతిక తెలంగాణగా మారుతుందన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది అని జాతి ఉషస్సు, తెలంగాణ తేజస్సు, ప్రజా కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు యాదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. కాళోజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అనేక మంది కవులు అయ్యారని కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మరోసారి నమస్సుమాంజులు తెలిపారు.