పారాలింపిక్ క్రీడాకారులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండించిన పారాలింపిక్స్ అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. గత గురువారం ప్రధాని మోడీ తన నివాసంలో పారాలింపిక్స్ బృందంతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం బయటికి వచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో మొత్తం 54 మంది భారత అథ్లెట్లు 9 ఈవెంట్లలో పాల్గొన్నారు. 5 బంగారు, 8 రజతం, ఆరు కాంస్య పతకాలతో మొత్తం 19 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ‘ మీ నుంచి నేను ప్రేరణ పొందాను. మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు’ అని ప్రధాని పారాలింపిక్స్ క్రీడాకారులతో అన్నారు. ‘ మీ విజయాలతో ఓటమివాద ధోరణిని ఓడించారు. మీ ద్వారా చిన్న విషయాలు కూడా దేశాన్ని ఎంతగానో చైతన్యపరచగలవు. స్కూళ్లు, ఇతర ప్రాంతాలను సందర్శించడం ద్వారా దేశాన్ని మున్ముందు మరింత చైతన్యపరచగలరు’ అని అని ప్రధాని అన్నారు.
కొవిడ్ వారియర్లకు తన పతకాన్ని అంకితం చేయడం గురించి ప్రధాని అడిగిన ప్రశ్నకు స్వర్ణపతక విజేత కృష్ణ నాగర్ సమాధానమిస్తూ‘ ఆరోగ్య కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలు అందించడం తాను చూశానని, అదే తనను ఈ పనికి పురికొల్పిందని చెప్పారు. అథ్లెట్ల అద్భుత ప్రదర్శనకు అచ్చెరువందిన ప్రధాని వారిని అభినందించారు. పారా అథ్లెట్ల విజయాలు దేశంలో క్రీడలపై స్ఫూర్తిని రగిలిస్తాయని, క్రీడాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. దివ్యాంగులకు కోచింగ్ కోసం ఓ వర్క్‌షాప్ అవసరమని అభిప్రాయపడిన మోడీ ఓ పుస్తకం కూడా రాయ వచ్చన్నారు.