బీజింగ్ : చైనాలో మళ్లీ డెల్టా వేరియంట్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ డెల్టా కేసులు పెరుగుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే డెల్టా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ప్రావిన్స్‌లో ఆంక్షలు కట్టుదిట్టం చేసి బయటకు ఎవరినీ వెళ్ల నీయడం లేదు. పుజియాన్‌లో ఆదివారం 22 కేసులు రాగా, సోమవారం మరో 59 కొత్త కేసులు వచ్చినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. 24 గంటల వ్యవధి లోనే కేసులు రెట్టింపు సంఖ్యలో రావడంతో ఈ కేసుల సంఖ్య 102 కి చేరిందని తెలిపారు. ఇక పోర్టు సిటీ జియామిన్ నగరంలో గత రెండు రోజుల వ్యవధిలో 33 కేసులు బయటపడ్డాయి. పుటియాన్‌లో మరో 59 కేసులు వచ్చాయి. దీంతో అధికారులు రంగం లోకి దిగి వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, బార్లను మూసివేశారు. జియామిన్ నగరం టూరిజం కేంద్రంగా ఉండగా, అక్కడ డెల్టా కేసులు బయటపడడంతో 60 శాతం విమానసర్వీసులు రద్దు చేశారు.
కాన్బెర్రాలో అక్టోబర్ 15 వరకు లాక్డౌన్ పొడిగింపు
ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో కరోనా కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. కొత్తగా మరో 22 కేసులు రావడంతో ప్రాదేశిక ముఖ్యమంత్రి ఆండ్రూ బార్ కాన్బెర్రాలో అక్టోబర్ 15 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.