పాక్ ఏజెంట్లకు రక్షణ రహస్యాలను చేరవేస్తున్నారన్న నేరారోపణ
భువనేశ్వర్ : పాకిస్థానీ ఏజెంట్లకు భారత దేశ రక్షణ రంగ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలతో నలుగురు డిఆర్‌డివొ కాంట్రాక్టు సిబ్బందిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉద్యోగులు చాందీపూర్ ఆన్‌సీ యూనిట్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి (ఐటిఆర్) లో పనిచేస్తున్నారు. పక్కా నిఘా సమాచారం మేరకు వీరిని మంగళవారం అరెస్టు చేశారు. ఐజి ఈస్టర్న్ రేంజి హిమాంశులాల్ నేతృత్వం లోని ప్రత్యేక బృందం ఈ నలుగురు డిఆర్‌డివొ ఉద్యోగులను అరెస్టు చేసింది. ఈ ఉద్యోగులకు మొదట ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. విదేశీ ఏజెంట్లతో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా వీరు మాట్లాడేవారని, పేర్కొన్నారు. ఈ ఉద్యోగులు రక్షణ రంగానికి చెందిన రహస్యాలు ఇచ్చేవారని, అందుకు బదులుగా ఆ ఏజెంట్లు వీరి బ్యాంకు ఖాతాలకు సొమ్మును జమ చేసేవారని తెలిపారు. మూడు రోజుల పాటు నిశితంగా గమనించిన తరువాత వీరిని అరెస్టు చేసినట్టు ప్రత్యేక బృందం అధికారులు తెలిపారు. వీరిని చాందీపూర్ పోలీస్ పరిధిలో తమ ఇళ్ల వద్ద అరెస్టు చేశారు. భారత దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతలకు తీవ్ర విఘాతం కలగడానికి కారణమయ్యే నేరానికి పాల్పడినందుకు ఈ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు ఐజి చెప్పారు.