అశ్లీల చిత్రాలతో క్యారెక్టర్ దిగజార్చే ప్రయత్నం
నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్: ఇన్‌స్టాగ్రాంలో యువతి అశ్లీల ఫొటోలు, వీడియోలు పెట్టి క్యారెక్టర్‌ను దిగజార్చేలా చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….. నల్గొండ జిల్లా, శ్రీనగర్ కాలనీకి చెందిన గంజి దిలీప్‌కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో బాధితురాలు కూడా అతడితో పనిచేసింది. ఇద్దరు కలిసి పనిచేసిన సమయంలో నిందితుడు బాధితురాలికి ప్రపోజ్ చేశాడు. దానికి యువతి నిరాకరించింది, దీనిని మనసులో పెట్టుకున్న నిందితుడు కొద్ది రోజుల తర్వాత ఉద్యోగం మానివేశాడు. ఇద్దరు కలిసి పనిచేసిన సమయంలో బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇన్స్టాగ్రాం క్రెడెన్షియల్స్‌ను తెలుసుకున్నాడు. ఉద్యోగం మానివేసిన తర్వాత ఆమె అశ్లీల ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రాంలో పోస్టింగ్ చేస్తున్నాడు. వీటిని చూసిన బాధితురాలు ఆశ్చర్యానికి గురై వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితడుఇని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ దర్యాప్తు చేశారు.