దుబాయి: యుఎఇ వేదికగా జరిగే ఐపిఎల్ రెండో దశలో తన మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూకలర్ జెర్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బరిలోకి దిగనుంది. రాయల్ చాలెంజర్స్ సెప్టెంబర్ 20న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఞతగా రెడ్ జెర్సీకి బదులుగా బ్లూజెర్సీని కోహ్లీ సేన ధరించనుంది. ‘ కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు ..ఫ్రంట్‌లైన్ యోధుల పిపిఇ కిట్ల రంగును పోలి ఉండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్‌సిబి సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ఆర్‌సిబి ట్వీట్ చేసింది.
గత కొన్ని సీజన్లుగా ఏదో ఒక మ్యాచ్‌లో పర్యావరణం పట్ల తమ మద్దతును తెలియజేయడం కోసం ఆర్‌సిబి ఆకుపచ్చ జెర్సీని ధరించేది. ఈ ఏడాది ఐపిఎల్ ఫేజ్ 1 సమయంలో కూడా మే 3న కెకెఆర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూజెర్సీలో కనిపించనున్నట్లు ఆర్‌సిబి ప్రకటించింది. అయితే కరోనా కారణంగా ఐపిఎల్ అర్ధంతరంగా వాయిదా పడడంతో ఇప్పుడు బ్లూ జెర్సీని ధరించనున్నారు. కాగా ఫేజ్ 1లో ఆర్‌సిబి మొదటి ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కాగా ఈ నెల 19న ముంబై ఇండియన్స్, సిఎస్‌కె మధ్య మ్యాచ్‌తో ఐపిఎల్ 2021 ఫేజ్2 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.