చాంద్రాయణగుట్ట: కంటికి రెప్పలా కాపాడాల్సిన సవతి తండ్రి కూతురిని చెరబట్టాడు. బెదిరించి అత్యాచారానికి పాల్పడుతూ ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెట్టాడో కసాయి తండ్రి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ కథనం ప్రకారం.. పాతబస్తీ బండ్లగూడలోని గౌస్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న మహిళ 2017లో అంబర్ పేటకు చెందిన వ్యాపారిని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే వివాహం కాగా భార్యతో అంబర్ పేటలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు గౌస్ నగర్ లోని రెండో భర్య వద్దకు వచ్చి వెల్తుండేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం కూతురును భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 13వ తేదీన ఈ దుశ్చర్యను తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.