భద్రాద్రి కొత్తగూడెం : నాటు వైద్యంతో రెండు నెలల వయసున్న శిశువు ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం ఓ బాబు జన్మించాడు. సోమవారం రాత్రి కడుపునొప్పి రావడంతో ఆ చిన్నారి అవస్థపడుతూ ఏడుపు ప్రారంభించాడు. ఆ కడుపునొప్పి తగ్గిందుకే తల్లిదండ్రులు మూఢ నమ్మకాల వైపు మొగ్గు చూపారు. బాబును తీసుకొని గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సంప్రదించాడు. అతడు ఆ బాబు బొడ్డు చుట్టూ పంటితో కొరికాడు. నొప్పితో చిన్నారి మరింత ఏడవడంతో పసరుమందు సైతం పోశాడు.మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశా కార్యకర్త చిన్నారిని గుర్తించి వెంటనే కరకగూడెం పీహెచ్‌సీకి తరలించింది. పరిస్థితి విషమించడంతో వైద్య సిబ్బంది 108 వాహనం ద్వారా భద్రాచలం ఆసుపత్రికి పంపించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా.. శిశువు కడుపులో చిన్న పేగు తెగినట్లు తేలింది. బొడ్డు చుట్టూ బలంగా కొరకడంతో.. చిన్నపేగు తెగిపోయిందని వైద్యులు స్పష్టం చేశారు. చికిత్సపొందుతూ పసికందు మంగళవారం మృతిచెందాడు.