భోపాల్: దేశంలోనే మైనర్లపై అత్యధిక బలాత్కార కేసులు, ఇతర నేరాలు మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. 2020లో మధ్యప్రదేశ్‌లో మైనర్లపై 3259 రేప్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 2785, ఉత్తరప్రదేశ్‌లో 2630 కేసులు నమోదయినట్లు నేషనల్ క్రైమ్ రాకార్డ్ బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) బుధవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో మైనర్లపై బలాత్కార కేసులే కాకుండా రికార్డు స్థాయిలో బాలలపై 17008 ఇతర నేరాలు జరిగినట్లు కూడా నమోదయింది. మధ్యప్రదేశ్‌లో భ్రూణహత్యలు కూడా ఎక్కువే నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్‌లో గిరిజన మహిళలపై జరిగిన బలాత్కార కేసులు 339. ఆ తరువాత చత్తీస్‌గఢ్(195), మహారాష్ట్ర (129) ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ వయోజనులపై బలాత్కార కేసులు తగ్గుముఖం పట్టాయి. అవి మధ్యప్రదేశ్‌లో 2339 కాగా, రాజస్థాన్‌లో 5310, ఉత్తరప్రదేశ్‌లో 2769 నమోదయ్యాయి. మైనర్లను వారికి బాగా తెలిసినవారే బలాత్కరించారని పోలీసులు తెలిపారు. ఇది శాంతిభద్రతల సమస్య కాకుండా సామాజిక సమస్యగా ఉందని పోలీసు శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్(ఎడిజిపి) ప్రజ్ఞా రిచా మాట్లాడుతూ “ గల్లంతయిన బాలికల ఆచూకీ తెలుసుకునేందుకు మేము వేర్వేరు ప్రచారాలు నిర్వహిస్తున్నాము. పెళ్లి చేసుకుంటామని ఆశపెట్టి పురుషులు వేరే ప్రదేశాలకు బాలికలను తీసుకెళ్లడమే వారి గల్లంతుకు కారణం. అలాంటి గల్లంతయిన బాలికలను కాపాడాక మేము వారిని తీసుకెళ్లిన పురుషులపై బలాత్కార కేసులు నమోదు చేస్తున్నాము. గల్లంతయిన వారి కేసులు 100 శాతం రిపోర్టు కావడం వల్లనే ఆ కేసులు ఎక్కువ ఉంటున్నాయి” అన్నారు.