ట్రిబ్యునల్స్ భర్తీపై కేంద్రానికి సుప్రీం చురకలు
న్యూఢిల్లీ : ట్రిబ్యునల్స్‌కు ఇటీవలి నియామకాలలో కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా తప్పుపట్టింది. కొందరినే ఎంచుకుని పేర్లను ప్రకంచిన రీతిలో వ్యవహారం ఉందని మండిపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్న అసంఖ్యాక ఖాళీలను భర్తీ చేయలేదు. పైగా తాము సిఫార్సు చేసిన పేర్లను పక్కకు పెట్టారని, కొందరినే తీసుకున్నారని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నాయకత్వపు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు ట్రిబ్యునల్స్‌కు ఇప్పటికీ విచారణ నిర్వహణాధికారులు లేరని, అదే విధంగా జుడిషియల్, సాంకేతిక విషయాల సభ్యులను కూడా తీసుకోలేదని పేర్కొన్న ధర్మాసనం రెండు వారాలలో నియామకాల ప్రక్రియ అంతా ముగించాలని స్పష్టం చేసింది. తాము సూచించిన పేర్లలో ఎవరినైనా నియమించకపోతే, ఖాళీలను ఇదే విధంగా ఉంచితే అందుకు కారణాలు తెలియచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇది ప్రజాస్వామిక దేశం, ఇక్కడ అంతా ఖచ్చితంగా చట్టాన్ని అనుసరించాల్సిందే అని కేంద్రానికి ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వం కోరిన తరువాతనే తాము ట్రిబ్యునల్స్‌కు పేర్లను సిఫార్సు చేశాం. కోవిడ్ దశలోనూ దేశమంతటా తిరిగి 544 మందిని ఇంటర్వూ చేశామని, తరువాత ఇందులో నుంచి 11 మంది పేర్లను జుడిషియల్ సభ్యులుగా, పది మంది పేర్లను టెక్నికల్ సభ్యులుగా పేర్కొంటూ సిఫార్సులు వెలువరించామని, అయితే ఇందులో కొందరినే నియమించారని, మిగిలిన వారిని వదిలేశారని ధర్మాసనం ఆక్షేపించింది. ఇదేం అరకొర పద్ధతి అని మండిపడింది.
అన్ని సిఫార్సులకు ఓకె చెప్పలేం ః కేంద్రం
ధర్మాసనం వ్యక్తం చేసిన అసంతృప్తిపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ జవాబిచ్చారు. అన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని, కొన్నింటిని వదిలేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరించే అధికారం కేంద్రానికి ఉందని అటార్నీ చెప్పడం అన్యాయం, దురదృష్టకరం అన్నారు. దేశమంతా తిరిగి తాము జరిపిన ప్రక్రియ ఉట్టిదేనా అని ప్రశ్నించారు. ట్రిబ్యునల్స్ నియామకాలలో జాప్యంపై ఇప్పుడు చీఫ్ జస్టిస్‌తో పాటు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావుతో కూడిన విచారణ జరుపుతోంది. సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని ప్రభుత్వం వృధా చేసింది. ఇది పద్ధతి కాదని ధర్మాసనం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానిదే తుది నిర్ణయం అయితే ఇక సెలెక్షన్ కమిటీ ఎందుకు, దీని సిఫార్సులు ఎందుకు అని జస్టిస్ నాగేశ్వర రావు ప్రశ్నించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ దతార్ స్పందిస్తూ ఐటిఎటికి సంబంధించి కమిటీ 41 మంది పేర్లను సిఫార్సు చేసిందని, అయితే కేవలం 13 మందినే ఎంచుకున్నారని, ఇది ఏ ప్రాతిపదికన జరిగిందనేది తెలియడం లేదని తెలిపారు. రు. దేశవ్యాప్తంగా వివిధ కీలక ట్రిబ్యునల్స్‌లో ,అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో దాదాపు 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితిని సవాలు చేస్తూ దాఖలు అయిన పలు పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్స్‌లో ఖాళీల భర్తీ చేపట్టకపోవడాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ఈ ధోరణితో చట్ట న్యాయపరమైన వ్యాజ్యాలను ఇదే విధంగా నాన్చాలని అనుకుంటున్నారా? అని ఇంతకు ముందటి విచారణ క్రమంలో నిలదీసింది. ఆ తరువాత స్పందనగా కేంద్రం అతి తక్కువ నియమాకాలతో ప్రకటన వెలువరించింది.