కేంద్ర మంతిమండలి ఆమోదం
న్యూఢిల్లీ : దేశీయ ఆటో రంగానికి కేంద్రం రూ 26,058 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పిఎల్‌ఐ) ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. కోవిడ్, సంబంధిత లాక్‌డౌన్ పలు కీలక సమస్యలతో సతమతమవుతున్న దేశ వాహన రంగాన్ని తగు విధంగా ఆదుకునేందుకు ప్రోత్సాహక పథకం దిశలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వాహనాల తయారీతో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని నిలిచేందుకు ఆటో ఇండస్ట్రీకి ఈ భారీ ప్రోత్సాహక ప్రాజెక్టును ప్రకటించారని కేంద్ర కేబినెట్ భేటీ తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రులు అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు.
భారీ స్థాయి సంస్కరణలలో భాగంగా ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇక ఈ పిఎల్‌ఐ స్కీం పరిధిలో డ్రోన్ల తయారీకి రూ 5వేల కోట్ల పెట్టుబడులు అందుతాయి. ఈ క్రమంలో రూ 1500 కోట్లకు పైగా అదనపు ఉత్పత్తి ఉంటుంది. ఐపిఎల్ స్కీంతో ఆటోమొబైల్ రంగం ద్వారా అదనంగా 7.6 లక్షల అదనపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో రూ 42500 కోట్ల మేర పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. దేశంలో ఉద్యోగ కల్పనలో వాహన తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. మాన్యుఫ్యాక్చరింగ్ జిడిపిలో ఆటోమొబైల్ పరిశ్రమ ద్వారా 35 శాతం వాటా దక్కుతోంది.