నిర్మాణాలకు ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గం
స్దలాలు పరిశీలన చేయనున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
వచ్చే ఏడాది నుంచి వైద్యకళాశాలలు ప్రారంభానికి కసరత్తు
చెస్ట్ ఆసుపతి, గడ్డి అన్నారం, అల్వాల్, గచ్చిబౌలి టిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు
రెండేళ్లలో మరో వెయ్యి పడకలు అందుబాటులో ఉంటాయని వైద్యులు వెల్లడి
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం తలపెట్టిన నాలుగు సూపర్ స్ఫెషాలిటీ ఆసుపత్రులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. దీంతో ఆసుప్రత్రులకు సంబంధించిన నిర్మాణాలు శరవేగంగా జరగనున్నాయి. ఇప్పటికే మంత్రులు నగర మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, రోడ్డు భవనాల మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి స్దలాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. తాజాగా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం, అల్వాల్, గచ్చిబౌలి టిమ్స్ ప్రాంగణంలో వచ్చే ఏడాదిలోగా అధునాతనమైన సౌకర్యాలతో కార్పొరేట్ ఆసుపత్రుల తలదనేలా ఆసుపత్రులు రూపు దిద్దుకోనున్నాయి. వీటికి టిమ్స్ ఆసుపత్రులుగా నామకరణం చేశారు, ఈ ఆసుపత్రులు అందుబాటులోకి మరో వెయ్యి పడకలు రోగులకు పెరుగుతున్నాయని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీటితో పాటు వైద్యకళాశాలలను ఏడాది ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపడుతామని వైద్యాధికారులు తెలిపారు.
ఇప్పటికే నగరంలో ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్, ఈఎన్‌టితో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో ప్రస్తుతం 7150 పడకలుండగా, ఏరియా ఆసుపత్రులతో పాటు జిల్లా దవఖానల్లో పడకలు కలిపితే 8200 పడకలు ఉన్నట్లు, కొత్తగా నిర్మించే నాలుగు ప్రభుత్వ దవఖానలు ప్రారంభమైతే గ్రేటర్ పరిధిలో 10వేల వరకు పడకలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. నగర ప్రజలే కాకుండా రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన నల్లగొండ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ పెద్ద ఎత్తున వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. దీంతో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్ పెట్టి పేదల ప్రాణాలు కాపాడవచ్చని వెల్లడిస్తున్నారు. గతేడాది కరోనా రోగులకు గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసి 1500మంది రోగులకు సేవలందించేలా ఏర్పాటు చేసి నగర ప్రజల నుంచి ప్రశంసలు పొందారు. కొత్త నిర్మించే నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ ప్రజల్లో గుండెల్లో చిరస్దాయిగా నిలుస్తాడని నగర ప్రజలు పేర్కొంటున్నారు. సూపర్ స్ఫెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య విద్య కళాశాల అనుబంధం ఆసుపత్రుల్లో బ్రాడ్ స్ఫెషాలిటీ సేవలు ఉంటాయని, జనరల్ మెడిసిన్, సర్జన్, డెంటల్, అనస్థీషియా, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్ ఉంటాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే కాలేజీల అనుబంధం ఆసుపత్రుల్లో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, యురాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, సిటీ సర్జరీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.