న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రభుత్వ విమర్శకుల నోరు మూయించేందుకు భారతీయ అధికారులు రాజకీయ ఉద్దేశ్యాలతో పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని మానవ హక్కుల నిఘా(హెచ్‌ఆర్‌డబ్ల్యు) సంస్థ ఆరోపించింది. సామాజిక కార్యకర్త హర్ష్ మందర్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించిన తర్వాత న్యూయార్క్ నుంచి హెచ్‌ఆర్‌డబ్ల్యు ఈ మేరకు శుక్రవారం ప్రకటనను జారీచేసింది. శ్రీనగర్, ఢిల్లీ, ముంబయిలో జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలు, నటుడు, మానవ హక్కుల కార్యకర్త ఇళ్లలో ప్రభుత్వ ఆర్థిక అధికారులు దాడులు ఈ నెల నిర్వహించారని కూడా ఆ సంస్థ పేర్కొంది.
“భావస్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశంకావడం వంటి వాటిని దెబ్బతీయడానికి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ఉద్దేశ్యాలతో జర్నలిస్టులు, విద్యావేత్తలు, విద్యార్థులు, తదితరులపై క్రిమినల్ కేసులు, దేశద్రోహకేసులను కూడా బనాయిస్తోంది” అని కూడా మానవ హక్కుల నిఘా సంస్థ పేర్కొంది. “విమర్శించే వారిని భయపెట్టేందుకే భారత ప్రభుత్వం ఇలా వేధింపులు, ఇతర ఎత్తుగడలు వేస్తోంది” అని హెచ్‌ఆర్‌డబ్ల్యు దక్షిణాసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ ఆరోపించారు.
బిజెపి వివక్ష పూరిత విధానాలను విమర్శించినందుకు మానవ హక్కుల కార్యకర్త మందర్‌పై తరచూ వేధింపులు, కశ్మీర్ జర్నలిస్టులు హిలాల్ మీర్, షా అబ్బాస్, షౌకత్ మొట్టా, అజర్ ఖాద్రీలపై దాడులు, టెలివిజన్ న్యూస్ ఛానల్ ఎన్‌డిటివి, దైనిక్ భాస్కర్ దినపత్రిక కార్యాలయాలపై పన్ను అధికారులు దాడులు నిర్వహించారని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.