ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దా అభ్యంతరకర వ్యాఖ్య
చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోందన్న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ ఇన్‌చార్జ్, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దా విరుచుకుపడ్డారు. సిద్ధూను ”పంజాబ్ రాజకీయాలలో రాఖీ సావంత్”గా ఆయన అభివర్ణించారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలలో రైతులు తమ పంటను మండీల వెలుపల అమ్ముకునేందుకు అనుమతించే చట్టం ఒకటి.దీన్ని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో నోటిఫై చేసింది. ఈ చట్టాన్ని ఢిల్లీ ప్రభుత్వం తొలగించిందా అని ప్రశ్నిస్తూ శుక్రవారం సిద్ధూ ట్వీట్ చేశారు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ రైతుల దోపిడీ కొనసాగుతోందని, పంటలకు ధర రాక రైతులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ప్రైవేట్ మండీల చట్టాన్ని అనుమతించిన కేజ్రీవాల్ ఇప్పటికైనా తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించారు. లేక ఆప్ తన కపట నాటకాలను కొనసాగిస్తూనే ఉంటుందా ఆని ఆయన నిలదీశారు. దీనిపై ఆప్ ఎమ్మెల్యే ఛద్దా స్పందిస్తూ పంజాబ్ రాజకీయాలలో సిద్ధూ రాఖీ సావంత్‌గా అభివర్ణించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన సిద్ధూను కాంగ్రెస్ అధినాయకత్వం మందలించిందని ఆయన వ్యాఖ్యానించారు.