గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించిన సిఎం
తక్షణం ఆమోదించిన గవర్నర్
సిఎల్‌పి భేటీకి కొద్ది గంటల ముందు పంజాబ్‌లో అనూహ్య పరిణామం
అవమానాలు ఇక భరించలేనని సోనియాకు చెప్పా
మీడియాకు అమరిందర్ వెల్లడి
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు కెస్టెన్ అమరిందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన సతీమణి, ఎంపి ప్రణీత్ కౌర్, కుమారుడు రణిందర్ సింగ్‌తో కలిసి శనివారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరుకున్న అమరిందర్ సింగ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు రాజీనామా సమర్పించారు.ఆయనతో పాటుగా మంత్రులంతా కూడా రాజీనామా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ శాసన సభాపక్షం భేటీ జరగడానికి కొద్ది గంటల ముందు ఆయన రాజీనామా చేశారు. కాగా అమరిందర్ రాజీనామాను గవర్నర్ వెంటనే అమోదించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరినట్లు గవర్నర్ కార్యాలయం ఒక అధికార ప్రకటనలో తెలిపింది. సిఎల్‌పి భేటీ మరోసారి నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు కెప్టెన్ తెలిపారు.
అందుకే పదవినుంచి తప్పుకోవాలని ఈ రోజు ఉదయమే నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా అనంతరం అమరిందర్ మీడియాకు వ్లెడించారు. ‘ ఈ ఉదయమే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడా. నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పటికేమూడు సార్లు ఎంఎల్‌ఎలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారినే సిఎం చేసుకోమని చెప్పా’ అని తెలిపారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కొత్త సిఎం ఎవరో తనకుతెలియదని చెప్పారు. మరో వైపు కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్షం శనివారం సమావేశమవుతోంది.
సిఎల్‌పి భేటీ నిర్వహించాలని శుక్రవారం అర్ధరాత్రే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఆ మేరకు పార్టీ ఎంఎల్‌ఎలకు సమాచారం ఇచ్చింది. మెజారిటీ ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రిని మార్చాలని ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అంతకు ముందు రణీందర్ ఇచ్చిన ట్వీట్‌లో పంజాబ్ సిఎం పదవికి రాజీనామా చేయడానికి తన తండ్రి వెళుతున్నారని, ఆయనతో కలిసి వెళ్లడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. తమ కుటుంబ పెద్దగా ఆయన తమను నడిపించబోతున్నారని , ఇది నూతన ప్రారంభమని పేర్కొన్నారు.