జమ్ము: ఓట్ల కోసం తాలిబన్లు, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ పేర్లను బిజెపి వాడుకుంటున్నదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ ఆరోపించారు. కాషాయ పార్టీ ఏడేళ్ల పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని, జమ్మూకాశ్మీర్‌ను ధ్వంసం చేశారని ఆమె విమర్శించారు. జాతీయ వనరులను తమవారికి చౌకగా అమ్మేస్తూ ఆ డబ్బును ప్రతిపక్ష పార్టీల ఎంఎల్‌ఎల కొనుగోళ్లకు బిజెపి ఉపయోగిస్తున్నదని ఆమె అన్నారు. బిజెపి వల్ల జమ్మూకాశ్మీర్ ఇబ్బందుల్లో పడిందని, ప్రమాదం దేశంలోని హిందువులకు కాదని, ప్రజాస్వామ్యానికని ఆమె అన్నారు. లడఖ్ ప్రాంతంలోకి చైనా చొచ్చుకువచ్చిన విషయం మాట్లాడితే ఓట్లు వేయరని, తాలిబన్లు, పాక్ గురించి బిజెపి పదేపదే ప్రస్తావిస్తుందని ఆమె విమర్శించారు. తాలిబన్ల గురించి తమ పార్టీ వైఖరి చెబితే తనను జాతి వ్యతిరేకిగా ముద్ర వేశారని ఆమె అన్నారు. ఆదివారం జమ్మూలో పిడిపి యువజన విభాగం నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఐదురోజుల పర్యటన అనంతరం శనివారం రాత్రి ఆమె జమ్మూ చేరుకున్నారు.