ఈనెల 30వరకు రాత్రి కర్ఫ్యూ
అమరావతి: ఎపిలో కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1337 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,38,690 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 9 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,070 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 699 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1282 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,09, 921 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 68, 568 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 77, 21, 082 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈనెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రోజూ రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉ.6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం-2005, ఐపీసీ సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.పెళ్లిళ్లు, శుభకార్యాలకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో పేర్కొంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.