మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ వేదికగా జరుగుతున్న జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగు విభాగంలో అస్సాంకు చెందిన అమ్లాన్ బొర్గొహెన్ విజేతగా నిలిచాడు. వరంగల్‌లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చాంపియన్‌షిప్‌లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈ పోటీల చివరి రోజు నిర్వహించిన 200 మీటర్ల విభాగం పరుగులో అమ్లాన్ బొర్గొహెన్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 20.75 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న అమ్లాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. తమిళనాడు అథ్లెట్ బి.నితిన్‌కు రజతం,ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు శనుమగ కాంస్య పతకాన్ని సాధించారు. ఇక విజేతలకు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పతకాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కోచ్ నీలేష్ మక్వానా, వరంగల్ జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు వరదా రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.