Saturday, November 23, 2024

హైదరాబాద్‌లో రెండోరోజూ కొనసాగిన గణేశ్ నిమజ్జనాలు

- Advertisement -
- Advertisement -

సోమవారం సాయంత్రానికి 4 వేల పైచిలుకు విగ్రహాల నిమజ్జనం

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాల కార్యక్రమం సోమవారం (రెండోరోజూ) కూడా కొనసాగింది. రాత్రివరకు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో మిగిలిన వినాయకులను అధికారులు నిమజ్జనం చేయించారు. మొదటిరోజు ఆదివారం ఖైరతాబాద్, బాలాపూర్‌లతో పాటు పలు పెద్ద వినాయకులను నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం అర్థరాత్రి మిగిలిన వినాయకులు నిమజ్జనం కాకపోవడంతో సోమవారం కూడా ఆ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగించారు. వినాయక విగ్రహాలను భక్తులు పెద్దఎత్తున ఊరేగింపు మధ్య ట్యాంక్‌బండ్‌కు తరలించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిమజ్జనం నేపథ్యంలో సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వేల సంఖ్యలో వినాయక ప్రతిమలు నిమజ్జనానికి రెడీగా ఉండటంతో పాటు వర్షం కారణంగా నిమజ్జనం కొంత ఆలస్యమయ్యిందని అధికారులు వివరించారు.

సాయంత్రం నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు…

సోమవారం సాయంత్రానికి ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనం పూర్తి కాగా ఎన్టీఆర్ మార్గ్‌లో వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. సాయంత్రం నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు రాకపోకలకు పోలీసులు అనుమతించారు. అయితే పివి మార్గ్‌లో వినాయక విగ్రహాలు సాయంత్రానికి బారులుతీరే ఉన్నాయి. ఈ విగ్రహాలను ఎన్టీఆర్ పార్క్, ఘాట్, లేపాక్షి సమీపంలోకి తరలించి అధికారులు అక్కడ నిమజ్జనం చేయించారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలను ఖైరతాబాద్ వంతెన నుంచి బయటకు పంపించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గం వైపు వాహనాలను అనుమతించ లేదు.

ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు….

ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, పివి మార్గ్‌లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద 1 క్రేన్ సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. సోమవారం సాయంత్రానికి 4 వేల పైచిలుకు విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగుతల్లి పైవంతెన వైపు రాకపోకలను పునరుద్ధరించారు. దీంతోపాటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు కూడా రాకపోకలకు అనుమతించారు.

చెత్త తొలగింపు

హుస్సేన్‌సాగర్‌లో ఓ పక్క గణేశ్ నిమజ్జనం కొనసాగుతుండగా మరోపక్క వ్యర్థాలు, చెత్త తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. గణేశ్ విగ్రహాల తయారీలో ఉపయోగించిన ఇనుప చువ్వలను రెండు క్లీనింగ్ మిషన్‌ల ద్వారా శుభ్రం చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తను జిహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు పరిశుభ్రం చేయడంతో పాటు గణేశ్ విగ్రహాలను సాగర్‌లో నుంచి బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News