మహిళా నేత రేఖాశర్మ ప్రశ్న
న్యూఢిల్లీ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఇంతకుముందటి మీటూ వివాదం ఇప్పుడు చుట్టుముట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న వ్యక్తిని సిఎం చేస్తారా? అని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ప్రశ్నించారు. ఆయనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం దేశంలోని మహిళా భద్రతకు ముప్పు అవుతుందని ఎన్‌సిడబ్లూ తరఫున ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమకు జరిగిన అవమానాలను తెలియచేసేందుకు మీ టూ పేరిట 2018లో ఓ బలీయమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం దశలో చన్నీపై తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి. ఆయన ఓ ఐఎఎస్ అధికారిణి పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని జుగ్సుపాకర అశ్లీల సందేశాలతో బాధపెట్టారని మీటూ జాబితాలో ఆయనను నిందితుడుగా చేర్చారు.
ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని రేఖా శర్మ తెలిపారు. అప్పట్లో ఆయనపై వచ్చిన ఫిర్యాదుల వార్తలపై పంజాబ్ మహిళా కమిషన్ తనంతతానుగా స్పందించింది. ఛైర్‌పర్సన్ ధర్నాకు దిగారు. అప్పట్లో ఆయనను మంత్రి పదవి నుంచి తొలిగించాలనే డిమాండ్ తీవ్రతరం అయిందని, వీటిని పక్కకు నెట్టి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం ఎంతవరకు భావ్యం అని రేఖా శర్మ నిలదీశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించాలని ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని శర్మ డిమాండ్ చేశారు. మహిళ సారధ్యంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రిగా మహిళా వేధింపుల వ్యక్తి నియమితులు కావడం దారుణం, ఇది తీవ్రస్థాయి విద్రోహం, ఆయనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని శర్మ డిమాండ్ చేశారు.