చండీగఢ్ : మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిన పెండ్లిని 18 ఏళ్ల లోపు యువతి అభ్యంతరం వ్యక్తం చేయకుంటే , ఆ పెండ్లిని రద్దు చేయాలని కోర్టును కోరక పోతే ఆ పెళ్లి చెల్లుతుందని పంజాబ్, హర్యానా కోర్టు తెలియచేసింది. ఈ నేపథ్యంలో ఆ వివాహాన్ని రద్దు చేయడం కుదరదని పేర్కొంది. దంపతులు విడిపోవాలనుకుంటే కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చని జస్టిస్ రీతూ బహ్రీ, జస్టిస్ అరుణ్ మోంగాలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దేశంలో బాలికల పెండ్లికి చట్టబద్ధమైన అర్హత వయసు 18 ఏళ్లు కాగా, 17 ఏళ్ల 6 నెలల 8 రోజుల వయసున్న బాలికకు 2019 లో ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒకరు సంతానం కాగా, తమ పెండ్లిని రద్దు చేయాలని కోరుతూ ఆ దంపతులు 2020 జూన్ 22 న లూథియానా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. మైనర్‌గా ఉన్నప్పుడు బాలిక సమ్మతితో జరిగిన పెండ్లి కావడంతో హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 (౩) ప్రకారం ఆ పెండ్లికి విలువ, గుర్తింపు లేదని, ఆ పెండ్లిని రద్దు చేయలేమని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో వారికి విడాకులు మంజూరు చేయలేమని పిటిషన్‌ను తిరస్కరించింది.