Wednesday, November 27, 2024

కరీంనగర్ అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద: గంగుల కమలాకర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద

410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్

రిటైనింగ్ వాల్ డిజైన్ పైనలైజేషన్ పై కసరత్తు

త్వరలో మానేరు రివర్ ప్రంట్ డిపిఆర్ సిద్దం

అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి

వారం తర్వాత పనుల పురోగతిపై మరోసారి సమావేశం

ఇరిగేషన్, టూరిజం ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష

KCR concentrate on Karimnagar development

 

కరీంనగర్: ప్రపంచ స్థాయి టూరిస్ట్ కేంద్రంగా కరీంనగర్ ను అతి త్వరలోనే మార్చడానికి సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సిఎం కెసిఆర్ కలలు కన్న విధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేర్ రివర్ ప్రంట్ ప్రాజెక్టుని నిర్మించబోతున్నామన్నారు. మంగళవారం ఉదయం రిటైనింగ్ వాల్ డిజైన్ తుదిరూపుపై టూరిజం, ఇరిగేషన్, కరీంనగర్ జిల్లా మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులతో హైదరాబాద్ జలసౌదలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రముఖ నగరాన్ని ఆనుకొని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అత్యద్భుతమైన వాటర్ బాడీ ఎల్ఎండి రూపంలో కరీంనగర్ సొంతమని, ఇక్కడ అద్భుత రివర్ ప్రంట్ ను తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ సంకల్పించారన్నారు. విదేశాల్లోని టూరిస్ట్ ప్రదేశాల గురించి చెప్పుకొనే ప్రజలకు వాటికన్నా అద్భుతమైన అన్ని వసతులతో మానేరు రివర్ ప్రంట్ ను తీర్చిదిద్దుతున్నామని గంగుల హామీ ఇచ్చారు.

ప్రధానంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అనుసరించాల్సిన డిజైన్, వాటర్ పౌంటేన్లు, బోటింగ్, కాటేజీలు, ఇతరత్రా ఏర్పాటు చేయబోయే సుందరీకరణ పనులపై టూరిజం శాఖ అధికారులతో, మానేర్ రివర్ ప్రంట్ వెడల్పు, లోతు, రివర్ బెడ్ పనులు నడుస్తున్న తీరుపై ఇరిగేషన్ అధికారులతో, భూ సేకరణ సంబందిత అంశాలపై రెవెన్యూ అధికారులతో, ఇతరత్రా పనులపై మున్సిపల్ అధికారులతో సుధీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించామని మంత్రి గంగుల పేర్కొన్నారు.

మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా డామ్ నుండి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవికాకుండా రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, మానేరు రివర్ ప్రంట్ డిపిఆర్ పనులు సైతం తుది ధశలో ఉన్నాయని త్వరలోనే ప్రభుత్వానికి డిపిఆర్ సమర్పిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలియజేశారని గంగుల గుర్తు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వం లక్ష్యం మేరకు నిర్మాణంలో ఏమాత్రం రాజీపడకుండా పనిచేస్తున్నామని అధికారులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారన్నారు. రిటైనింగ్ వాల్ తుది డిజైన్, ప్రాజెక్టు పూర్తి డిపిఆర్ వారం రోజుల్లో పూర్తిచేసి పూర్తి నివేదికలతో మీటింగ్ కు రావాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు, ఇరిగేషన్ ఇఎన్ సిలు మురళీధర్, శంకర్, టూరిజం కార్పోరేషన్ ఎండి మనోహర్ రావు, సిఇ డిజైన్స్ శ్రీనివాస్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ డా. యాదగిరిరావు, ఇరిగేషన్ ఎస్ఇ శివకుమార్, కరీంనగర్ ఆర్ డిఒ ఆనంద్ కుమార్, ఇతర రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News