అఫ్ఘన్, ఇండోపసిఫిక్ సమస్యలపై చర్చ: పిఎంఒ
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో తాజా పరిస్థితి, ఉగ్రవాదం విస్తరణ, తదితర ప్రాంతీయ సమస్యలపై ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ చర్చించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, మహిళలు, మైనార్టీల హక్కులపైనా వారి మధ్య చర్చలు సాగాయి. ఇండోపసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్వేచ్ఛాయుత నావిగేషన్ కోసం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా ఇరువురు నేతలు చర్చించినట్టు ఆ ప్రకటన పేర్కొన్నది. ఇదే అంశాన్ని భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుయెల్ లెనాయిన్ ట్విట్ చేశారు. తమ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణపై ప్రధాని మోడీ కూడా ట్విట్ చేశారు. తాను తన స్నేహితుడు మేక్రాన్‌తో అఫ్థన్ పరిస్థితిపై చర్చించానని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంతో విలువ ఇస్తామని ప్రధాని ట్విట్ చేశారు.