ఏర్పాట్లు చేసుకుంటే మంచిది
కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
వాయిదా పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ) ప్రవేశపరీక్షలకు మహిళకు అనుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలనే కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహిళల హక్కుల అంశాన్ని వాయిదా వేయడం తద్వారా నిరాకరణకు గురిచేయడాన్ని సమ్మతించేది లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తెలిపింది. వారి హక్కును వారు ఇప్పుడే పొందనివ్వాలని స్పష్టం చేసింది. ఎన్‌డిఎ ఎంట్రెన్స్‌కు మహిళల ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే ఏడాది మే నాటికి వెలువడుతుందని, అప్పటివరకూ వారికి అనుమతిని వాయిదా వేయాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేసుకుంది. ఈ ఏడాది నవంబర్ 14న ఎన్‌డిఎ ఎంట్రెన్స్ జరుగుతుంది. ఈ పరీక్ష విషయంలో మినహాయింపును ఇవ్వాలని కేంద్రం కోరింది. అయితే న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌తో కూడిన ధర్మాసనం స్త్రీ పురుష సమానత్వం దిశలో సైన్యంలో ప్రవేశాలకు ఎన్‌డిఎ ప్రవేశపరీక్షలను ఏర్పాటు చేసినందున, అత్యవసర పరిస్థితులలో కీలకమైన రీతిలో వ్యవహరించేది భద్రతా బలగాలే అయినందున వీటికి సంబంధించిన సమగ్ర ఏర్పాటు దిశలో ఎటువంటి జాప్యం అయినా కుదరదని ధర్మాసనం తెలిపింది.
ఎన్‌డిఎలోకి మహిళల ప్రవేశం విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాల్సి ఉందని స్పష్టం చేశారు. యుపిఎస్‌సితో మాట్లాడి, ఇప్పటి ఎంట్రెన్స్‌కు మహిళలను అనుమతించడం గురించి సరైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఎన్‌డిఎ ఎంట్రెన్స్‌లో మహిళల ప్రవేశం దిశలో చర్యకు కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి లాయరు చిన్నయ్ ప్రదీప్ శర్మ వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్‌డిఎలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి ఇప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందుకు ఓ స్టడీగ్రూప్ ఏర్పాటు అయిందని, వచ్చే ఏడాది ప్రవేశ పరీక్ష వరకూ మహిళకు అనుమతిని నిలిపివేయడం మంచిదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న యత్నాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని, ప్రశంసిస్తామని, ఇప్పటి నుంచే ఈ ప్రక్రియకు ప్రయత్నించండని సత్ఫలితాలే సాధిస్తారని ధర్మాసనం తెలిపింది.