దసరా తరువాత ప్రారంభించేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు
సీజనల్ వ్యాధులతో రద్దీగా మారిన పలు బస్తీదవఖానలు
నాణ్యమైన సేవలతో వైద్యం కోసం వస్తున్న నగర వాసులు
ఉచితంగా మందులు, డయాగ్నస్టిక్ టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
రోజుకు 120మందికి వైద్యం అందిస్తున్న ఆసుపత్రులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులకు ప్రజలు బస్తీదవఖానలకు వెళ్లితే నాణ్యమైన వైద్యసేవలు అందడంతో స్దానిక ప్రజలు చికిత్స కోసం క్యూ కడుతున్నారు. గత వారం రోజుల నుంచి దవఖానాలు రోగులతో రద్దీగా కనిపిస్తున్నాయి. దీని దృష్టిలో పెట్టుకుని జిల్లా వైద్యశాఖ అధికారులు మరో 12 బస్తీదవఖాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్‌ఎంసీతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. గత ఆరేళ్ల నుంచి దశలవారీగా గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 224 బస్తీదవఖానలు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుండగా, కొత్త ఏర్పాటు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజలు వెళ్లే అవసరంలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న దవఖానలు రోజుకు 100 మంది నుంచి 120మంది వరకు చికిత్స చేస్తున్నారు.
అదే విధంగా ఆసుపత్రులకు వెళ్లేవారికి ల్యాబ్ పరీక్షల సమస్యల ఉంటే ఇటీవలే ప్రభుత్వం 08 మిని డయాగ్నస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు. బస్తీ దవఖానలో ఒక డాక్టరు,నర్సు,కాంపౌండర్ సేవలందిస్తూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండటంతో దగ్గు,జలుబు,జ్వరం లక్షణాలున్న వారంతా బస్తీదవాఖానల్లో గంటల తరబడి ఉంటూ వివిధ రకాలు పరీక్షలు చేయించుకుని కావాల్సిన మందులు తీసుకుంటున్నారు. గ్రేటర్ నగరంలో లక్ష జనాభాకు ఒక దవాఖాన ఏర్పాటు చేస్తామని గతంలో సిఎం కేసీఆర్ ప్రకటించి, ప్రతి డివిజన్‌కు రెండు చొప్పను 300 ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 236 బస్తీ దవాఖానలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు రక్తపరీక్షలు, థైరాయిడ్, యూరిన్, లివర్‌ఫంక్షన్, సీబీసి పరీక్షలతో పాటు 200రకాల మందులు, 60 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా ముషీరాబాద్, అంబర్‌పేట, సరూర్‌నగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా,ఉప్పగూడ, చార్మినార్, మెహిదిపట్నం, యాకుత్‌పురా, కార్వాన్, నాంపల్లి,ఖైరతాబాద్ వంటి చోట్ల ఏర్పాటు చేసిన బస్తీదవాఖానకు రోగుల రద్దీ ఎక్కువ ఉందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈఏడాది సీజనల్ వ్యాధులను వైద్య సిబ్బంది సులువుగా ఎదుర్కొని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. త్వరలో శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే చేసే విధంగా ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రతి రోగికి వైద్యం సేవలందిస్తామని సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు.