పెగాసస్‌పై సుప్రీం నిపుణుల కమిటీ
వచ్చేవారం ఉత్తర్వులు
ప్రధాన న్యాయమూరి వెల్లడి
లాయర్‌కు విడిగా సమాచారం
న్యూఢిల్లీ : స్నూపింగ్, ఫోన్ ట్యాపింగ్ సంబంధిత పెగాసస్ వ్యవహారంపై ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీనిపై వచ్చే వారం ఉత్తర్వులు వెలువరించనుంది. ఈ విషయాన్ని గురువారం మరో కేసు విచారణ దశలో ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ వెల్లడించారు. పెగాసస్ స్నూపింగ్‌పై తామే దర్యాప్తునకు దిగుతామని అత్యున్నత న్యాయస్థానం విచారణ క్రమంలో ఇప్పుడు మౌఖికంగా తెలియచేసింది. ఇది గణనీయ పరిణామం అయింది. పెగాసస్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఓ సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, వచ్చేవారం తాత్కాలిక ఆదేశాలు వెలువరిస్తామని తెలిపింది. మొత్తం ఈ అంశానికి సంబంధించి స్వతంత్య్ర దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించాలని దాఖలు అయిన పలు పిటిషన్లపై తమ రూలింగ్ ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఓ వైపు పెగాసస్ పూర్తిస్థాయిలో దేశ కీలక భద్రతా విషయం అని, దీనిపై తమంతట తామే సొంతంగా నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందటి విచారణ దశలో తెలిపింది.
పైగా పెగాసస్‌పై పూర్తి స్థాయి అఫిడవిట్‌ను న్యాయస్థానానికి ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. ఇప్పుడు గురువారం ఇందుకు ప్రతిగా సుప్రీంకోర్టు తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంబంధిత విషయంలో కీలక పరిణామం అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ స్పైవేర్ పెగాసస్ ద్వారా ప్రముఖ భారతీయుల ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు, హ్యాకింగ్‌కు దిగినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు దారితీశాయి. వ్యక్తుల గోప్యతకు కేంద్రం చెల్లుచీటి పలికిందనే విమర్శలు తలెత్తాయి. గురువారం ఇతర అంశాలను విచారించే క్రమంలో ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణతో కూడిన ధర్మాసనం పెగాసస్ పిటిషన్‌దార్ల తరఫున ఒకరి పక్షాన వాదిస్తున్న లాయర్ చందర్ ఉదయ్‌సింగ్‌ను పిలిపించి వచ్చే వారం తాము పెగాసస్‌పై ఆదేశాలు వెలువరిస్తామని తెలిపింది. ఈ వారమే ఆర్డర్ వెలువరించాలని అనుకున్నామని , అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కమిటీ ఏర్పాటులో కొన్ని చిక్కులు తలెత్తడంతో సాధ్యం కాలేదని తెలిపారు.
తాము తలపెట్టిన టెక్నికల్ కమిటీలోకి తీసుకోదల్చిన సభ్యులు కొందరు వెంటనే ఇందులో చేరడానికి వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారని, దీనితో కమిటీ ఏర్పాటు పూర్తి కాలేదని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. కమిటీ ఏర్పాటుకు సమయం తీసుకుంటున్నామని, వచ్చే వారమే ఏ సమయంలో అయినా కమిటీ నిర్మాణం పూర్తి అవుతుంది, ఎప్పుడైనా దీనిని ప్రాతిపదికగా చేసుకుని ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు. పెగాసస్‌ను రాజకీయ నాయకులపై ప్రయోగించారా? ఇది జరిగితే ఎందుకు జరిగింది? కారణాలు ఏమిటీ? అనేది నిర్థారించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్‌లు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ రంగంలోకి దిగారు. కపిల్ సిబల్ ఇటీవలి రోజులలో కోర్టులలో తమకు కన్పించడం లేదని, అందుకే పెగాసస్ ఆర్డర్ల గురించి మరో న్యాయవాది సింగ్‌కు తెలియచేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ఈ విషయాన్ని తాము సిబల్‌కు తెలియచేస్తామని సింగ్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఆ తరువాత సంబంధిత ధర్మాసనం గురువారం నాటి షెడ్యూల్‌లోని ఇతర కేసుల విచారణను చేపట్టింది. పెగాసస్‌పై తీవ్రస్థాయి వాదోపవాదాల విచారణల క్రమంలో ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టు తమ తాత్కాలిక ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. తొందర్లోనే వీటిని వెలువరించడం జరుగుతుందని పేర్కొంది. ఈ లోగా కేంద్రం తరఫున వాదిస్తోన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్ని అంశాలను ఆలోచించుకుని సవివరణాత్మక అఫిడవిట్ దాఖలుపై ఓ నిర్ణయం తీసుకుని కోర్టు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అంతకు ముందటి విచారణ దశలో తాము ఇకపై అఫిడవిట్ దాఖలు చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తేల్చిచెప్పారు.