గ్యాంగ్‌లీడర్ , ఇద్దరు సాయుధులు మృతి
పట్టపగలే…జడ్జి ఎదుటే ఘటన
గోగి టిల్లూ గ్యాంగ్‌వార్ పరిణామం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత రోహిణీ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు భీకర స్థాయిలో కాల్పుల ఘటన జరిగింది. గ్యాంగ్‌వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్స్ మృతి చెందారు. కోర్టు రూంలోపలే ఈ ఘటన జరగడంతో దేశ రాజధానిలో అత్యంత ప్రధాన స్థలాలలో కూడా భద్రతాలేమి పరిస్థితి ఉందని స్పష్టం అయింది. ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ గోగిని ఓ కేసు విచారణకు సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, చుట్టూ గన్‌మెన్‌లు ఉండగా లోపలి కోర్టు నెంబర్ 206కు తీసుకువచ్చారు. అప్పటికే లోపల లాయర్ల వేషధారణతో, వారి దుస్తులతో ఉన్న ప్రత్యర్థి ముఠా టిల్లూగ్యాంగ్ వ్యక్తులు సాయుధులై అక్కడ కాపు కాసి ఉన్నారు. వారు తమ వద్ద దాచుకుని ఉన్న గన్స్ తీసి కాల్పులు జరిపారు. ఈ దశలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్స్ మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కాల్పుల ఘటనతో లోపల అంతటా భయానక పరిస్థితి ఏర్పడింది. న్యాయమూర్తి విచారణకు సిద్ధం అవుతున్న దశలోనే కాల్పులు జరిగాయి.
లాయర్లు, సాక్షులు, జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్యాంగ్‌స్టర్ జితేందర్‌పై సాయుధులు మూడుసార్లు కాల్పులు జరిపారు. దీనితో ఆయన వెంట ఉన్న ప్రత్యేక బలగాల సిబ్బంది ఎదురు కాల్పులు జరిపింది. దీనితో కాల్పులు జరిపిన ఇద్దరు అక్కడికక్కడే బుల్లెట్ల ధాటికి కుప్పకూలి మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ జితేందర్ ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స దశలో చనిపొయ్యాడు. కాల్పులఈ క్రమంలో 30 బుల్లెట్లు కోర్టు హాల్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. జితేందర్ గోగి పలు నేరాలలో నిందితుడుగా ఉన్నాడు. ఓ కేసుకు సంబంధించి గత ఏడాది నుంచి తీహార్ జైలులో బందీగా ఉన్నాడు. టిల్లూ గ్యాంగ్‌కు గోగి గ్యాంగ్‌కు మధ్య చిరకాలంగా పడటం లేదు. గోగిని కోర్టుకు తీసుకువస్తున్నారని తెలుసుకుని టిల్లూ గ్యాంగ్ వారు ముందుగానే కోర్టు హాల్‌లోకి వచ్చి దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కాల్పులకు తెగబడటంతో వారిని నిలువరించేందుకు ప్రత్యేక బలగాలు కాల్పులు జరిపినట్లు, ఇద్దరు దుండగులు హతులు అయినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా విలేకరులకు తెలిపారు. అయితే ప్రత్యర్థి వర్గం కాల్పుల్లో గాయపడ్డ గోగి తరువాత మృతి చెందినట్లు తెలిసిందని వివరించారు.
తనిఖీల తంతు ఉండగానే
సాధారణంగా కోర్టుల భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేకించి గ్యాంగ్‌స్టర్స్ లేదా తీవ్రస్థాయి నేరాలకు పాల్పడ్డ వారిని కోర్టుకు హాజరుపర్చే క్రమంలో కీలకమైన బందోబస్తు, పూర్తి స్థాయి తనిఖీలు అవసరం. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటనలో లాయర్లమని చెప్పి సాయుధులు ఇద్దరు కోర్టు రూంలోపలికి ఏ విధంగా వచ్చారు? నిఘా చర్యలు సరిగ్గా లేవా? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. కోర్టులో జడ్జి తమ సీటులో కూర్చుని ఉండగా, లాయర్లు, గోగి కూడా అక్కడే ఉండగా లాయర్ల దుస్తులలో వచ్చిన వారు కాల్పులు జరిపారని అక్కడున్న లాయర్ లలిత్ కుమార్ విలేకరులకు తెలిపారు. మధ్యలో ఉన్న ఓ వ్యక్తి కూడా కాల్పులకు గురయ్యాడని చెప్పారు.
గోగిటిల్లూ గ్యాంగ్ వార్ ఏళ్లకథ
ఢిల్లీలో గోగి టిల్లూ గ్యాంగ్‌ల మధ్య చాలా ఏళ్లుగా వార్ సాగుతోంది. పరస్పర దాడుల క్రమంలో ఘర్షణలలో ఇప్పటికే పాతిక మందికి పైగా చనిపొయ్యారు. గోగికి విరోధిగా పేరొందిన సునీల్ అలియాస్ టిల్లూ ఇరువురూ తమ గ్యాంగ్‌లతో అలిపూర్, సోనిపట్‌లలో బలవవంతపు వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నారు. వీరి మధ్య వైరం కాలేజీ రోజుల నుంచి సాగుతూ వస్తోంది. సాధారణంగా కోర్టు హాల్‌లోకి ఎవరు ప్రవేశించాలన్నా మెటల్ డిటెక్టర్‌ల తనిఖీ తప్పనిసరి. అయితే ఇప్పుడు ఇవి పనిచేయలేదా? అందరిని ఎటువంటి తనిఖీలు లేకుండానే లోపలికి పంపించారా? అనే అంశాలపై తాను ఇప్పటికిప్పుడు స్పందించలేనని ఢిల్లీ పోలీసు కమిషనర్ అస్థానా తెలిపారు.
ఘటనపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, బాధ్యులు ఎవరైనా, లోపాలు ఏ స్థాయిలో జరిగినా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ పోలీసుల నిర్లక్షం ఏమీ లేదని, వారు అప్రమత్తతో ఉండటం వల్లనే సకాలంలో షూటర్లను దెబ్బతీశారని తెలిపారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు తరువాతనే ఇతర వివరాలు తెలియచేయడం జరుగుతుందని వివరించారు. ఇది గ్యాంగ్‌వార్ కాదని స్పష్టం చేశారు. కోర్టు హాల్‌లోనే రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగాయనే వార్తలను, ఇక్కడ జరిగింది గ్యాంగ్‌వార్ అనే ప్రచారాన్ని ఢిల్లీ పోలీసు వర్గాలు తోసిపుచ్చాయి.