తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచినట్టే అసెంబ్లీ నిర్వహణలోనూ దేశానికి తలమానికం కావాలి
సభ సంప్రదాయాలను సభ్యులు పాటించాలి ఫలవంతమైన చర్చలు జరగాలి సత్ సంప్రదాయాలను నెలకొల్పడానికి స్పీకర్ ఆలోచన చేయాలి
అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలి ప్రతిపక్షం ప్రతిపాదించే అంశాలపైన కూడా చర్చ జరగాలి బిల్లులను సభ్యులకు ముందుగానే పంపించాలి పార్లమెంట్‌లో మాదిరిగా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు జరగాలి : శాసనసభ తొలిరోజు సమావేశం వాయిదా తర్వాత జరిగిన బిఎసి భేటీలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : నూతన రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచినట్లే…అసెంబ్లీ నిర్వహణలో కూడా దేశానికే ఆదర్శవంతంగా నిలవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలాషించారు. సభ, సంప్రదాయాలను పాటిస్తూనే సభలో ఫలవంతమైన చర్చ జరగాలన్నారు. అలాగే సభలో ప్రోటోకాల్ నిబంధనలను విధిగా ప్రతి సభ్యుడు పాటించాలన్నారు. సభలో గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ ఆలోచన చేయాలని సూచించారు. శుక్రవారం మొదటి రోజున అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం బిఎసి సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. సభలో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలన్నారు. చర్చ జరిగే తీరునుబట్టి, స్పూర్తిని సూచించేలా ఆ చర్చకు పేరు రావాలన్నారు. అందుకు తగిన సమయాన్ని కేటాయించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపక్షాల సలహాలను, సూచనలను కూడా తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం తరఫున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న సబ్జెక్టులను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు. ఇందులో భాగంగా ఐటి పరిశ్రమలు, హరితహారం, వ్యవసాయంతో పాటు పాతబస్తీ అభివృద్ధి, మైనారిటీలు అనే అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సూచించిన అంశాలను కూడా సభలో చర్చించాలన్నారు. ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, వాయిదా తీర్మానాలు వంటి సభా సాంప్రదాయలను విధిగా పాటిస్తూ అసెంబ్లీని నిర్వహించాలని సిఎం కెసిఆర్ కోరారు. బిల్లులను సభ్యులకు ముందస్తుగానే పంపించాలన్నారు. అలాగే అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యులకు ప్రతిరోజూ లంచ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. శాసనసభ్యులకు ప్రోటోకాల్ నిబంధనలను తుచ తప్పకుండా పాటించేలా స్పీకర్ చర్యలు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించి సిఎం, మంత్రులతో సహా శాసనసభ్యులు, సిఎస్ తదితర ప్రభుత్వోన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ సూచించారు. తదనుగుణంగా తగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పార్లమెంటులో మాదిరి అసెంబ్లీలో కూడా కానిస్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ అన్నారు.
తద్వారా నూతన సభ్యులకు మాజీ సభ్యులకు చర్చలకు, డిబేట్లు సెమినార్లు బోధనకోసం వేదికను కల్పించాలన్నారు. త్వరలోనే ఈ నిర్మాణానికి సంబంధించిన తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా శాసన సభ్యులను తోడ్కొని ఢిల్లీ పర్యటన చేపట్టాలని స్పీకర్‌ను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కోరారు. శాసన సభ ఔన్నత్యాన్ని పెంచడానికి దేశానికే ఆదర్శంగా నిలవడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలన్నారు. పలు కమిటీల మీటింగులు రెగ్యులర్‌గా జరిగేలా చూడాలన్నారు. వీలైతే కమిటీలో దేశంలో, బయటి దేశాల్లో పర్యటనలు చేపట్టి నూతన అంశాలను నేర్చుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.అసెంబ్లీ, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదిక మాత్రమేన్నారు. అంతేతప్ప కుస్తీ పోటీలకు కారాదన్న అనే విషయాన్ని సభ్యులు గుర్తుంచుకోవాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు సమావేశాలను నిర్వహించాలన్నారు.