ఉ॥ 9 నుంచి 12గం.వరకు
పరీక్షలు రాయనున్న సెకండియర్ విద్యార్థులు
ప్రతి పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసొలేషన్ సెంటర్లు, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్న పత్రాలు తయారు చేస్తారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలలో శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
వ్యాక్సిన్ వేసుకున్న అధ్యాపకులు, సిబ్బందిని మాత్రమే పరీక్షల విధులను నియమించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. అక్టోబర్ 25న లాంగ్వేజ్ పరీక్షను నిర్వహిస్తారు. అక్టోబర్ 26న ఇంగ్లీష్, 27న గణితం, పొలిటికల్ సైన్స్, అక్టోబర్ 28న గణితం, హిస్టరీ, 29న ఫిజిక్స్, ఎకనామిక్స్, అక్టోబర్ 30న ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలను నిర్వహిస్తారని ఇంటర్ బోర్డు తెలిపింది. కరోనా తీవ్రత నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంసెట్, దేశంలోని వివిధ పోటీ పరీక్షల కోసం ఇంటర్ ఫస్టియర్ మార్కులు అవసరం కావడంతో పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
అక్టోబర్ 25 సెకండ్ లాంగ్వేజ్
అక్టోబర్ 26 ఇంగ్లీష్
అక్టోబర్ 27 గణితం 1ఎ, బాటనీ,పొలిటికల్ సైన్స్
అక్టోబర్ 28 గణితం 1బి,జువాలజి, హిస్టరీ
అక్టోబర్ 29 ఫిజిక్స్, ఎకనామిక్స్
అక్టోబర్ 30 కెమిస్ట్రీ, కామర్స్
నవంబర్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు గణితం పేపర్ 1
నవంబర్ 2 మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ