హైదరాబాద్ నగరంలో భారీ వర్షం, గంటపాటు కుంభవృష్టి, భయాందోళనకు గురైన
నగరవాసులు, నాలుగు ప్రాంతాల్లో 4సెం.మీ పైగా వాన, అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి
మన తెలంగాణ/ హైదరాబాద్ : నగరంలో వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ మరోసారి అస్తవ్యస్తమైంది. గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 4 సె.మిపైగా వర్షం కురవడంతో నగరం పూర్తిగా జలమయమైంది. గంట పాటు కుంభవృష్టిని తలపించడంతో నగరవాసులు భయాందోళనలకు గురైయ్యారు. పలు ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించింది. నగర వ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు వర్షంలోనే తడిస్తు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. మరోవైపు లొతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి.
భారీ వర్షానికి మూసిలో వరద ఉధృతి పెరగడంతో మూసారం బాగ్ వద్ద బ్రిడ్జిపైనుంచి ప్రవహించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు టాఫ్రిక్ పూర్తి నిలిపివేశారు. శివారు ప్రాంతాల్లో వర్షం భీభత్సవం సృష్టించింది. మణికొండ, సరూర్‌నగర్, ఎల్‌బినగర్, నాగోల్, ఉప్పల్ బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, కాప్రా, నాచారం, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చందానగర్, ముషీరాబాద్, మెహిదిపట్నం, సెంట్రల్ యూనివర్సీటీ, రాజేంద్రనగర్, మెహిదిపట్నం, లక్డీకాపూల్, ఖైరతాబాద్ చంద్రాయణ్‌గుట్ట, చార్మినార్, కోఠి, అబిడ్స్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఓయు, తార్నాక, హబ్సిగూడ, అల్వాల్, తిరుమల్‌గిరి, కుత్బుల్లాపూర్, చింతల్, గాజుల రామారం, బాలనగర్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి
నగర వ్యాప్తంగా ఒక్కసారిగా భారీవర్షం కురువడంతో జిహెచ్ ఎంసి అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను అలర్డ్ చేశారు. దీంతో మాన్సూప్ బృందాలను రంగంలోకి దింపిన జిహెచ్‌ఎంసి అధికారులు ఎక్కడికక్కడ సహాయ చర్యలను చేపట్టారు. దీంతో రోడ్లపై చేరిన వరద నీటిని తోలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అధికారులతో పాటు ఇంజనీరింగ్ విభాగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచన వేసి తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా మేయర్ ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలాంటి విపత్తులు ఎదురైన వెంటనే జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు అందించాల్సిందిగా సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలను అందించాయి. నగరంలో భారీ వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు ఇళ్ల నుంచి బయటికి రావద్దని జిహెచ్‌ఎంసి సూచించింది.