తాలిబన్ల హయాంలో కలకలం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో మీడియాపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేకించి వార్తా సంస్థలపై నియంత్రణలలో భాగంగా సరికొత్తగా 11 రూల్స్‌ను ప్రవేశపెట్టారు. ఇస్లామ్‌కు, దేశ ప్రముఖులకు విరుద్ధంగా ఉండే ఎటువంటి అంశాలు ఉన్న వార్తల ప్రచురణ జరగకుండా ఆంక్షలు ప్రధానంగా విధించారు. తాము తీసుకువచ్చిన 11 అంశాల నియమావళిని ఖచ్చితంగా మీడియా సంస్థలు పాటించి తీరాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. చిక్కుల్లో పడకుండా ఉండాలంటే జర్నలిస్టులు, పత్రికలు, టీవీ న్యూస్ ఛానల్స్ ఎప్పటికప్పుడు తమ వార్తాకథనాల విషయంలో ప్రభుత్వ మీడియా కార్యాలయాలలోని ఉన్నతాధికారుతో సంప్రదించాల్సి ఉంటుంది. ఏ రాత అయినా సమన్వయంతోనే పంపించాలి. ప్రచురించాలని ఫర్మానాల వంటి ఆదేశాలు వెలువరించారు. తాలిబన్ల పాలనను , వారు ఇప్పుడు వెలువరించిన 11 రూల్స్‌ను చూసి పత్రికలు విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే పలు మీడియా సంస్థలు మూసివేతకు దిగుతున్నాయని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక ఓ వార్తాకథనం వెలువరించింది. ఇప్పుడు అనేక పత్రికలు ప్రచురణల రూపాన్ని వదిలి కేవలం ఆన్‌లైన్‌కు పరిమితం అయ్యాయని తెలిపారు. పత్రికలు పాటించాల్సిన 11 సూత్రాలేమిటనేవి పూర్తి స్థాయిలో వెల్లడికాలేదు.