తిరువనంతపురం: కేరళలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఎసి)కి రాజీనామా చేసిన కొన్ని రోజులకే కాంగ్రెస్ నాయకుడు విఎం సుధీరన్ సోమవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి)కి రాజీనామా ప్రకటించారు. ఆయన తన రాజీనామాను కెపిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్‌కు అందజేశారు.
ఆయన తన రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న కారణాలను తెలుపలేదు. కానీ సుధాకరన్ నూతన నాయకత్వం, ప్రతిపక్షనాయకుడు విడి సతీశన్ పనితీరుతో అసంతృప్తిగా ఉన్నారని ఊహాగానాలు నెలకొన్నాయి. ‘సుధీరన్ రాజీనామాచేయాల్సింది కాదు’ అని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అభిప్రాయపడ్డారు. నెలకొన్న పరిస్థితి చాలా దురదృష్టకరమైనదని యుడిఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్ అన్నారు. సుధీరన్ది నిష్కళంక ఇమేజ్. ఆయన సంప్రదాయ విధానాలకు కట్టుబడిన వ్యక్తి. సుధాకరన్, సతీశన్, ఊమెన్ చాందీ, రమేశ్ చెన్నితల మధ్య వైర వాతావరణం రాజుకుని ఉంది.
రాష్ట్ర, కేంద్ర నాయకత్వాల మధ్య ఓ ప్రక్క రాజీ మంతనాలు జరుగుతున్న తరుణంలోనే అసమ్మతి కూడా ఉంది. వివాదాస్పద సంస్కరణల చర్యలకు వ్యతిరేకంగా ఈ అసమ్మతి ఉందని సమాచారం. ఈ పరిస్థితి ఎఐసిసి ప్రధానకార్యదర్శి, కేరళ ఇన్ఛార్జీ తారీఖ్ అన్వర్‌కు క్లిష్టమైన టాస్క్‌గా మారింది.