హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్లు ఇవ్వడంపట్ల సిఎంఒ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ అధికారులను అభినందించారు. ఇప్పటివరకు 99.6 శాతం ప్రభుత్వ విద్యాసంస్థలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్లు పూర్తి చేశారని, మిగిలిన విద్యాసంస్థలకు అక్టోబర్ 2 నాటికి మిషన్ భగీరథ నీటి కనెక్షన్లు ఇవ్వడం పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని అంగన్ వాడీలకు కూడా భగీరథ నీరు సరఫరా కావాలన్నారు. హైదరాబాద్ ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఇవాళ స్మితా సభర్వాల్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్ తో పాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు హాజరయ్యారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా ప్రస్తుత స్థితిని సెగ్మెంట్ వారీగా తెలుసుకున్న స్మితా సభర్వాల్, ప్రతీ గ్రామానికి రోజూ తలసరి నిర్దేశించిన 100 లీటర్ల నీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలుగకూడదని స్మితా సభర్వాల్ ఆదేశించారు. అంతరాయం లేని నీటి సరఫరా కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా భగీరథ పైప్ లీకేజీ ఏర్పడితే తక్షణమే మరమ్మత్తులు చేసి నీటి సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు.
మండలాల వారీగా ఉన్న మొబైల్ టీంలు పూర్తి అప్రమత్తతతో ఉండాలన్నారు. కొన్ని గ్రామాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో స్టెబిలైజేషన్( స్థిరీకరణ ) పూర్తి చేసినందుకు మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందిని స్మితా సభర్వాల్ అభినందించారు. నెల రోజుల్లోపు మిగిలిన ఆ గ్రామాల్లోనూ స్థిరీకరణ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ ప్లాంట్ ఏరియాల్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాలన్నారు. పండ్ల మొక్కలు, చింత చెట్లతో పాటు టేకు, ఏగిస, ఎర్రచందనం వంటి ఎక్కువ విలువ కలిగిన మొక్కలను విరివిగా నాటాలని సూచించారు.