న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా నిర్మాణ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఒక్కరే సందర్శించడం ఆలోచనారహితమే కాకుండా, సున్నితమైన అంశంగా సంకేతాలిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశం లోని ప్రజలు తమ విలువైన జీవితాలను కోల్పోయి, ఇంకా కోలుకుంటున్న పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో అని ప్రధాని ఆలోచించడం ప్రశ్నార్ధకమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా పాత్రికేయుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచనారహిత సందర్శనకు తాము మద్దతు ఇవ్వలేమని, దీనికి బదులు ఏదైనా ఆస్పత్రి నిర్మాణ ప్రదేశాన్ని సందర్శిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. మూడు నెలల క్రితం మనం మన ప్రియతములను రక్షించుకోడానికి ప్రయత్నించగా, ఈరోజు ప్రధాని రూ. 25 వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సందర్శించడం , ఈ సమయం ప్రశ్నార్ధకమౌతోందని విమర్శించారు. ఆదివారం మోడీ సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని సందర్శించారు.