టెక్సాస్: ప్రపంచ అత్యంత సంపన్నుడుజెఫ్ బెజోస్(57) రోదసి వెంచర్ ‘బ్లూ ఒరిజిన్’ రెండో మానవ సహిత రోదసి మిషన్ ‘న్యూ షెపర్డ్ 18(ఎన్‌ఎస్ 18) లాంచ్ తేదిని ప్రకటించారు. కృత్రిమ గురుత్వాకర్షణ శక్తితో రోదసి కాలనీలు నిర్మించాలని, అక్కడ లక్షలాది మంది నివసిస్తూ పనిచేసేలా లక్ష్యంగా పెట్టుకుని 2000లో బ్లూ ఒరిజిన్‌ను ఆయన స్థాపించారు.
న్యూ షెపర్డ్ 18 రోదసి నౌకలో నలుగురు వ్యోమగాములు అక్టోబర్ 12న రోదసిలోకి వెళతారు. ఆ నలుగురిలో ఇద్దరి పేర్లు ప్రకటించారు. ఒకరు మాజీ నాసా ఇంజినీర్, ప్లానెట్ ల్యాబ్స్ సహవ్యవస్థాపకుడు క్రిస్ బోషుజెన్, రెండవ వ్యక్తి డసాల్ట్ సిస్టమ్స్‌లో లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ విభాగపు వైస్‌చైర్మన్, మీడియాడెటా సహవ్యవస్థాపకుడు గ్లెన్ డి వ్రీస్. వీరితోపాటు వెళ్లనున్న మరో ఇద్దరి పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్‌సైట్ వన్ నుంచి ఈ రోదసి నౌక నింగికి ఎగురనుంది.