రాహుల్ గాంధీ ఆరోపణ
మలప్పురం(కేరళ): ప్రజల మధ్య బంధాలను, వారధులను ప్రధాని నరేంద్ర మోడీ తెంచుతున్నారని, దీని వల్ల భారతదేశ సిద్ధాంతాలకే ముప్పు ఏర్పడుతోందని వాయనాడ్ ఎంపి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం బుధవారం నాడిక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల భాష, సంస్కృతి, జీవన విధానాలు, సమస్యలు, మతాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా తన ఒక్కడికే భారతదేశంపై సంపూర్ణ అవగాహన ఉందని ప్రధాని మోడీ చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. భారతదేశం కేవలం భౌగోళికంగా సరిహద్దులతో కూడుకున్నది మాత్రమే కాదని, ఇక్కడి ప్రజల మధ్య పరస్పర అనుబంధాలతో పెనవేసుకున్నదని ఆయన అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను ప్రధాని మోడీ విడగొడుతుంటే వాటిని అతికించే బాధ్యత తనపైన ఉందని రాహుల్ అన్నారు. మలప్పురం జిల్లాలో డయాలసిస్ కేంద్రాన్ని రాహుల్ ప్రారంభించారు.