బాణసంచా తయారీపై సుప్రీం
న్యూఢిల్లీ : కొంత మందికి జీవనోపాధికి అవకాశం ఉంటుందనే అంశంతో అత్యధికుల జీవన హక్కును కాదనలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొందరి జీవనోపాధి పోతుందని లక్షలాది మందిని ప్రాణాంతకపు రసాయనికాల బారిన పడనిస్తారా? అని పశ్న్రించింది. బాణాసంచాల తయారీలో అత్యంత ప్రమాదకర రసాయనికాలను వాడుతున్నారనే సిబిఐ నివేదికపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీవ్రంగా స్పందించింది. టపాకుల తయారీలో నిషేధిత బేరియం వాడకం కుదరదని కోర్టు ఆదేశాలు వెలువరించిన విషయాన్ని విస్మరించారా?లేబుల్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని న్యాయమూర్తులు ఎంఆర్ షా, ఎఎస్ బొపన్నతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
విషపూరిత పదార్థాల వాడకం జరుగుతున్నట్లు తేలితే ఇది ప్రాధమికంగా నేరం అవుతుందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో స్వాధీనం చేసుకున్న సరుకుల్లో హానికర కెమికల్స్‌ను వాడినట్లు తేలిందని సిబిఐ నివేదిక అందించింది. హిందూస్థాన్ ఫైర్‌వర్క్, స్టాండర్డ్ ఫైర్‌వర్క్ సంస్థలు భారీ స్థాయిలోఈ రసాయనాలను కొనుగోలు చేయడం, వీటిని బాణసంచా తయారీలో వాడినట్లు నిర్థారణ అయిందని సిబిఐ తెలిపింది. గత ఏడాది మార్చిలోనే తాము సంబంధిత కంపెనీలకు ఈ ప్రమాదకర పదార్థాల వాడకం కుదరదని హెచ్చరించామని అయితే దీనిని పట్టించుకోకుండా ఉండటం సబబు కాదని, శిక్షార్హ నేరం అవుతుందని తెలిపారు. కాలుష్య కారకం కాని బాణసంచను తయారు చేయడం కీలకం అని సుప్రీంకోర్టు తెలిపింది. బాణసంచా తయారీదార్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆత్మారాం నాదకర్ణి వాదించారు. దీపావళి సమీపిస్తోందని, బాణసంచా తయారీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవల్సిన బాధ్యత సంబంధిత పేలుడు పదార్థాలభద్రతా సంస్థ (పెసో)పై ఉందని, లేకపోతే వీటి తయారీపై ఆధారపడి జీవించే వేలాది కార్మికుల జీవనోపాధి పోతుందని లాయరు తెలిపారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.