నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి టీమ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు కింగ్ నాగార్జున, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కెఎస్ రామారావు, డి.సురేష్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “లవ్ స్టోరి సినిమా సక్సెస్ తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినీ పరిశ్రమకే ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు. ఒక మంచి సినిమానిస్తే థియేటర్లకు వచ్చేందుకు తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఊరికే హిట్ కాలేదు.
అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు దర్శకుడు శేఖర్ కమ్ముల”అని అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “రెండు సున్నిత విషయాల గురించి ఈ సినిమాలో చెప్పాం. దాన్ని కథలో చక్కగా చూపించాం. ‘లవ్ స్టోరి’ సక్సెస్‌తో చాలా హ్యాపీగా ఉన్నా”అని తెలిపారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ “దర్శకుడు శేఖర్ కమ్ముల కంటెంట్, ఆయన గుడ్‌విల్ ఎంత ఉందో ‘లవ్ స్టోరి’ సక్సెస్ చూపిస్తోంది. ఇకపై మన జర్నీ ఆగొద్దు, మంచి సినిమాలు చేద్దాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నారాయణ దాస్ కె.నారంగ్, హీరోయిన్ సాయి పల్లవి, సుద్దాల అశోక్ తేజ తదితరులు మాట్లాడారు.