Saturday, November 23, 2024

ఆందోళన కలిగిస్తున్నఇషాన్, సూర్యకుమార్‌ల ప్రదర్శన..

- Advertisement -
- Advertisement -

దుబాయి: యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ సీజన్14లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు త్వరలో జరిగే ప్రపంచకప్‌లో చోటు ఉంటుందా లేదా అనేది సందేహంగా మారింది. ఐపిఎల్ రెండో దశ మ్యాచుల్లో ఇద్దరు కూడా అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం అలవాటుగా మార్చుకున్నారు. కిందటి ఐపిఎల్‌లో ముంబైని ముందుండి గెలిపించిన ఇషాన్, సూర్యకుమార్‌లకు టీమిండియాలో కూడా చోటు దక్కింది. ఇక భారత్ తరఫున కూడా ఇద్దరు మెరుగైన బ్యాటింగ్‌తో అలరించారు. కానీ యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ మలి దశ టోర్నీలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 15 పరుగుల స్కోరును అందుకోలేక పోయారు.

దీన్ని బట్టి వీరి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో ఇద్దరు టీమిండియా సరికొత్త స్టార్లుగా ఎదిగారు. విపరీతమైన పేరు రావడంతో వీరు ఆటకంటే ఇతరత్రా విషయాలపైనే దృష్టి పెడుతున్నారు. గతంలో హార్దిక్ పాండ్య కూడా ఇలాంటి వైఖరితోనే జాతీయ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఇక ఐపిఎల్‌లో రాణించిన ఆటగాళ్లకే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్న ఇషాన్, సూర్యకుమార్‌లకు టీమిండియా చోటు దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరి బదులు ఐపిఎల్‌లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠిలకు చోటు కల్పించాలనే డిమాండ్ జోరందుకుంది. దీంతో మిగిలిన మ్యాచుల్లో బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి యువ ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్‌లపై నెలకొంది. ఒకవేళ ఇలాంటి ఆటనే కనబరిస్తే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కడం కష్టమే. మరోవైపు ఇషాన్, సూర్యకుమార్‌ల బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా కలవరానికి గురిచేస్తోంది.

ఇప్పటికే ఇషాన్ కిషన్‌తో కోహ్లి ఈ విషయంలో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపిఎల్‌లోనే విఫలమైతే ఇక తీవ్ర ఒత్తిడి ఉండే వరల్డ్‌కప్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉంటుందోనని కోహ్లి ఆందోళన చెందుతున్నాడు. ఇక వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇషాన్, సూర్యకుమార్‌ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. రానున్న వరల్డ్‌కప్ నేపథ్యంలో కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు ఇలా పేలవ ప్రదర్శన చేయడం నిజంగా ఆందోళన కలిగించే పరిణామమే. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా ఐపిఎల్‌లో పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. ఒక్క పంజాబ్‌పై మాత్రమే అతను కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. మిగతా మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఇక ముంబైకే చెందిన మరో కీలక ఆటగాడు జస్‌ప్రిత్ బుమ్రా కూడా అంతంత మాత్రం ప్రదర్శనే చేస్తున్నాడు. ఇలా వరల్డ్‌కప్‌కు ముందు చాలా మంది కీలక ఆటగాళ్లు ఫామ్‌ను కోల్పోవడం జట్టు యాజమాన్యాన్ని కలవరానికి గురిచేస్తోంది.

Suryakumar and Ishan Kishan Faced troubles in IPL 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News