అత్యవసరమన్న ప్రధాని మోడీ
ఇప్పటి లోటు భర్తీకి కేంద్రం చర్యలు
ఆరోగ్య వ్యవస్థపై రాష్ట్రాలతో సమన్వయం
ఆధునిక, సాంప్రదాయక వైద్యాలకు ఊతం
జైపూర్ : దేశంలో ప్రతి జిల్లాకో వైద్య కళాశాల, లేదా పిజి వైద్య విద్యాసంస్థ ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఈ విధమైన ఏర్పాటు అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటోందన్నారు. రాజస్థాన్‌లో నాలుగు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు, పెట్రోకెమికల్స్ టెక్నాలజీ సంస్థ ప్రారంభోత్సవం ఆన్‌లైన్‌లో జరిపిన తరువాత ప్రధాని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి ఏర్పాట్లను గమనిస్తే వైద్య విద్యాపరంగా లోటు ఉందని అంగీకరించారు. వైద్య విద్యలో ఖాళీ పరిస్థితితో ఆరోగ్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ అగాధం పూడ్చేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలిపారు. ప్రభుత్వం నివారణ సంబంధిత ఆరోగ్య పరిరక్షణ దిశలో చర్యలు తీసుకొంటోంది. చికిత్స కన్నా నివారణ మేలు అనే పద్థతిని ప్రచారం చేస్తోందని, ఇదే సమయంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేద,యోగాలను ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. గడిచిన ఆరు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా పలు చోట్ల చూస్తే మొత్తం మీద 170 మెడికల్ కాలేజీలు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, మరో వంద వైద్యకళాశాలల ఏర్పాటు పనులు వేగవంతం అవుతున్నాయని వివరించారు.
ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల రావల్సిందే. పిజి వైద్య సంస్థలు కూడా జిల్లాకు ఒకటి అయినా అవసరం అని ప్రధాని తెలిపారు. ఇంతకు ముందటి భారత వైద్య మండలి (ఎంసిఐ) వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపిన మోడీ పలు నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తాయని, పారదర్శకత లోపించిందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. కీలక సంస్థలో అవకతవకలతో దేశంలో నాణ్యమైన వైద్య విద్యపై ప్రభావం పడిందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు ఆరోగ్య సేవల పంపిణీకి విఘాతం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అంశాలను గమనించే ప్రభుత్వం ఎంసిఐ స్థానంలో పలు సంస్కరణలతో కూడిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు ఈ కమిషన్ పనితీరు ప్రభావం సుస్పష్టంగా ఉందని చెప్పారు. తాను గుజరాత్‌కు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఆ దశలో వైద్య విద్య , చికిత్స సంబంధిత మౌలిక వ్యవస్థాగతంగా పలు సవాళ్లు ఎదుర్కొవల్సి వచ్చిందని వివరించారు. ఈ సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొని, పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించామని గుర్తు చేసుకున్నారు.
స్వీయానుభవంతో రాష్ట్రస్థాయిలో ఉన్న వైద్య విద్యా , వైద్య ఏర్పాట్ల కొరతను తాను తెలుసుకుని, జాతీయ స్థాయిలో వీటిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. జాతీయ దృక్పథంతో వ్యవహరించి ఆరోగ్య రంగంలో సంస్కరణలకు నూతన జాతీయ పాలసీ దిశలో కృషి చేసినట్లు తెలిపారు. ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది కాబట్టి తనకు రాష్ట్రాలు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాగా తెలుసునని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి పలు చిక్కులు ఉంటాయి. ఇది విభజితం అయి ఉంటుంది. అనుసంధానత ఉండదు. జాతీయ స్థాయిలో సమిష్టి దృక్పధం వీలుకానిస్థితి ఉంటుంది. వీటన్నింటిపైనా కేంద్రం దృష్టి సారించిందని, మౌలిక స్థాయిలో రాష్ట్రాలకు ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఉండే బాధ్యతలను గుర్తించి కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయసాధనతో పరిపూర్ణతకు పాటుపడుతున్నట్లు తెలిపారు. సాంప్రదాయక, ఆధునిక వైద్యం విషయంలో దూరాలు ఉన్నాయి. వీటి నిర్వహణల విషయంలో ఉండే పాలనపరమైన లోపాలను సరిదిద్దడం జరుగుతోందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం నేషనల్ హెల్త్ పాలసీ దిశలో ఆలోచిస్తోందని చెప్పారు.
ఆరు నుంచి 22 ఎయిమ్స్‌ల దశకు
ఇప్పటివరకూ దేశంలో ఉన్న ఆరు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు (ఎయిమ్స్) దశ నుంచి 22 ఎయిమ్స్‌తో కూడిన పటిష్ట వైద్య విద్యా, చికిత్సల పరిస్థితికి చేరుకునేందుకు రంగం సిద్ధం అయిందని సంతోషంగా చెప్పగల్గుతున్నామని ప్రధాని తెలిపారు. దేశంలో 22 ఎయిమ్స్ నెట్‌వర్క్‌లతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.2014లో దేశవ్యాప్తగా యుజి, పిజి మెడికల్ సీట్లు దాదాపు 82000 వరకూ ఉండేవి. ఇప్పుడివి 1.40 లక్షల సంఖ్యకు చేరాయని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.