బాధ్యతల స్వీకరణ.. భద్రతకు ప్రతిన
న్యూఢిల్లీ : దేశ వైమానిక దళ ప్రధానాధికారిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. దేశ సర్వసత్తాకత, సమగ్రతలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించడం జరుగుతుందని ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వాయుసేన ఉప ప్రధానాధికారిగా ఉన్నారు. ఇప్పటివరకూ ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కెఎస్ భదూరియా పదవీకాలం గడువు ముగిసిన తరువాత ఇప్పుడు ఆయన స్థానంలో చౌదరి వచ్చారు. దేశ వైమానిక రంగ బలోపేతానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త ప్లాట్‌ఫాంలు, ఆయుధాలు, సరికొత్త పరికరాలు, సామాగ్రితో కార్యనిర్వాహక సామర్థాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని తెలిపారు. బాధ్యతల స్వీకరణ దశలో వివేక్‌రామ్ కొద్ది సేపు వాయుసేన సిబ్బందిని ఉద్ధేశించి ప్రసంగించారు. సరికొత్త టెక్నాలజీ, స్వదేశీ ప్రోత్సాహం, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తారని , సైబర్ భద్రత, శిక్షణలలో నూతన వైఖరులకు దిగుతామని ప్రకటించారు.