సిద్దిపేట: బతుకమ్మ పండుగ నేపథ్యంలో సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్ ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బతుకమ్మ చీరలను అందించి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ”కేసిఆర్ నగర్ లో 360 డబుల్ బెడ్ రూం గృహ ప్రవేశాలు, పిఎన్ జి వంట గ్యాస్ సరఫరా ప్రారంభోత్సవం, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ, దసరా. పండుగ పూట పేద ప్రజలు కొత్త వస్త్రాలతో ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నాణ్యమైన, చూడ చక్కని 110 రకాల రంగు రంగుల చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నాం.
జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన 3 లక్షల 83 వేల మందికి చీరలను పంపిణీ చేయనున్నాం. పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలన్నది కేసిఆర్ కల. ఆ ఉద్దేశ్యంతో కేసిఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలో 3 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు కేటాయించి గృహ ప్రవేశాలు జరిపించాం. మరో 500 డబుల్ బెడ్ రూం ఇండ్లు గృహ ప్రవేశాలకు సిద్ధం చేశాం. ఒక్క సిద్దిపేట పట్టణంలోనే సకల సౌకర్యాలతో కేసిఆర్ నగర్ లో గేటెడ్ కమ్యూనీటి తరహాలో 163 కోట్ల రూపాయలతో 2460 ఇండ్ల నిర్మాణం చేపట్టాం. వాటిలో ఇప్పటికే 1976 డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు కేటాయించి పండుగ వాతావరణంలో నూతన వస్త్రాలు బహూకరించి గృహ ప్రవేశాలు చేపించాం. కేసిఆర్ నగర్ కాలనీలో పేదల కోసం అదనంగా మరో 1000 ఇండ్లను నిర్మిస్తున్నాం. స్థల ఎంపిక, టెండర్ ప్రక్రియ పూర్తయింది. పైపుడ్ గ్యాస్ సరఫరా కనెక్షన్ ఛార్జీలు 7000 కాగా, అతి తక్కువ ఖర్చు రూ.1090తోనే కేసిఆర్ నగర్ లోని పేదలకు ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం. పైపుడ్ గ్యాస్ సరఫరాతో రక్షణ తోపాటు డబ్బు ఆదా అవుతుంది. సిలిండర్ కోసం ఎదురు చూసే బాధలుండవు. పైపుడ్ గ్యాస్ సరఫరా 35 శాతం నుంచి 40 శాతం డబ్బులు ఆదా అవుతాయి. త్వరలో టొరెంటో కంపెనీ ప్రతినిధులు సిద్దిపేట పట్టణంలోని అవసరమైన వారికి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నారు” అని చెప్పారు.
Harish Rao distributes Bathukamma Sarees in Siddipet